అజ్ఞాతంలో ఉన్న టీవీ-9 ర‌విప్ర‌కాష్ ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. ఇవి ఇప్పుడు మ‌ళ్లీ తెలుగు మీడియా, రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద సంచ‌ల‌నంగా మారుతున్నాయి. ఈ ఉదంతంలో రోజుకో కొత్త వార్త తెలుగు మీడియా, రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు పాఠ‌కుల‌కు సైతం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇక అజ్ఞాతం నుంచి ఇచ్చిన తాజా ఇంట‌ర్వ్యూలో ర‌విప్ర‌కాష్ తాను సీఈవోగా ఉండ‌గా జ‌రిగిన కొన్ని అంశాల‌ను బ‌య‌ట పెట్టారు. 

ఇక ఇటీవ‌ల టీవీ -9 కొత్త మేనేజ్‌మెంట్ ర‌విప్ర‌కాష్‌ను టీవీ-9 సీఈవో పోస్టు నుంచి తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. ర‌విప్ర‌కాష్‌ను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డంతో ఆయ‌న అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మ‌రోవైపు పోలీసులు ఆయ‌న్ను విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులు పంపినా ఆయ‌న నుంచి ఎలాంటి స్పంద‌నా కూడా లేదు. ఇక ఆయ‌న అరెస్టు కోసం కూడా పోలీసులు కాచుకుని కూర్చొనే ఉన్నారు. ఇదిలా ఉంటే ర‌విప్ర‌కాష్ అజ్ఞాతం నుంచే ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మై హోం రామేశ్వ‌ర‌రావు 2016లోనే టీవీ-9ను ద‌క్కించుకోవాల‌ని ప్లాన్ చేసి త‌న‌ను క‌లిసిన‌ట్టు తెలిపారు. 

ఆయ‌న ప్ర‌తిపాద‌న‌ను తాను తిర‌స్క‌రించాన‌ని... ఈ ఆలోచ‌న వెన‌క రాజ‌కీయ ఎజెండా ఉంద‌న్న విష‌యాన్ని తాను అప్ప‌ట్లోనే ప‌సిగ‌ట్టాన‌న్నారు. రామేశ్వ‌ర‌రావు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, చినజీయర్ స్వామికి అనుచ‌రుడ‌ని... ఆయ‌న త‌న రాజ‌కీయ, సైద్ధాంతిక ప్ర‌యోజ‌నాల కోస‌మే టీవీ-9 టేకోవ‌ర్ చేయాల‌ని భావించినందున దానికి తాను అడ్డు త‌గిలాన‌న్నారు. ఇక తెలంగాణ ప్ర‌భుత్వం త‌న‌ను టార్గెట్ చేయ‌డం వెన‌క ఉన్న కార‌ణాల‌ను కూడా ఆయ‌న చెప్పారు.  తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల త‌ర్వాత చాలా మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని... దీనిని ఖండిస్తూ తాను ఓ క‌థ‌నాన్ని ప్ర‌సారం చేశాన‌ని.. అది ప్ర‌భుత్వానికి న‌చ్చ‌క‌పోవ‌డంతో అప్ప‌టి నుంచే తానను టార్గెట్‌గా చేసుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. 

ఇక 2018 సెప్టెంబర్‌లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులు జ‌రిగిన‌ప్పుడు తాను అమెరికాలో ఉన్నాన‌ని.. అప్పుడు రామేశ్వ‌ర‌రావు కుమారుడు, సోద‌రుడు వార్త‌ను ఎలా క‌వ‌ర్ చేయాలో చెపుతున్న‌ట్టు త‌న‌కు న్యూస్ రూం నుంచి కాల్ వ‌చ్చింద‌ని ఆయ‌న చెప్పారు. ఇక రేవంత్‌రెడ్డి వారికి రాజ‌కీయ శ‌త్రువు కావ‌డంతో ఆయ‌న్ను ఎలా అణ‌గ‌దొక్కాలా ? అన్న ప్ర‌య‌త్నంలోనే వారు ఇలా చేశార‌ని కూడా ర‌విప్ర‌కాష్ చెప్పారు. ఏదేమైనా ఈ ఇష్యూలో ర‌విప్ర‌కాష్ మ‌రిన్ని సంచ‌ల‌నాలు బ‌య‌ట‌పెట్టే ఛాన్సులు ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: