ఏపీ రాజ‌ధాని జిల్లా గుంటూరులో వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌యోగానికి దిగారు. ఇక్క‌డ నుంచి ఏకంగా ముగ్గురు మ‌హిళ‌ల‌కు ఆయ‌న టికెట్లు ఇచ్చారు. వీటిలో రెండు రిజ‌ర్వ్ నియోజ‌క‌వ‌ర్గాలు కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మ‌హిళా నాయ‌కురాళ్ల గెలుపుపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నిజానికి తాజాగా జ‌రిగిన ఎన్నిక‌లు రెండు ప్ర‌ధాన ప‌క్షాల న‌డుమ హోరా హోరీగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి టికెట్‌ను ఆచితూచి ఇచ్చారు ఇరు పార్టీల ప్ర‌ధాన నేత‌లు. ఈ నేప‌థ్యంలోటీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు గుంటూరు జిల్లాను మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. రాజ‌ధాని జిల్లా కావ‌డంతో ఇక్క‌డ నుంచి ఎక్కువ సీట్ల‌లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు.


ఈ నేప‌థ్యంలో దాదాపు సిట్టింగుల‌కే ఛాన్స్ ఇచ్చారు. అయితే, వైసీపీ నుంచి మాత్రం ప్ర‌యోగాలు జ‌రిగాయి. సీట్లు ఆశించిన స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను కూడా ప‌క్క‌న పెట్టిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఆయా స్థానాల్లో కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చారు. ఇలా ఇచ్చిన వాటిలో చిల‌క‌లూరి పేట‌, తాడికొండ ప్ర‌ధానంగా ఉన్నాయి. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను మార్చి మ‌రీ మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇచ్చారు. అదేవిధంగా ప్ర‌త్తిపాడులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ స‌మ‌న్వ‌య క‌ర్త మేక‌తోటి సుచ‌రిత‌కే అవ‌కాశం ఇవ్వ‌గా చిల‌క‌లూరి పేట నుంచి బీసీ మ‌హిళ విడ‌ద‌ల ర‌జ‌నీకి అవ‌కాశం క‌ల్పించారు. అదేవిధంగా తాడికొండ నుంచి డాక్ట‌ర్ శ్రీదేవిని రంగంలోకి దింపారు. 


ఇక‌, ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాలూ టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఈమూడూ కూడా టీడీపీ సొంతం చేసుకుంది. ఒక్క‌ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన రావెల కిశోర్‌బాబు మాత్రం పార్టీ మారిపోయారు. చిల‌క‌లూరి పేట నుంచి గెలిచిన ప్ర‌త్తిపాటి పుల్లారావు మంత్రిగా చ‌క్రం తిప్పుతున్నారు. ఈయ‌న‌ను ఎలాగైనా ఓడించి తీరాల‌నే క‌సితో జ‌గ‌న్ ఈయ‌న‌పై ఎన్నారై మ‌హిళ‌, బీసీ వ‌ర్గానికి చెందిన ర‌జ‌నీని రంగంలోకి దింపారు. పుల్లారావు సీనియ‌ర్ అయిన‌ప్ప టికీ.. ఆయ‌న‌కు ధీటుగా ర‌జ‌నీ ప్ర‌చారం నిర్వ‌హించారు. ఇక్క‌డ హోరాహోరీ పోరులో గెలుపు ఈ ఇద్ద‌రి మ‌ధ్య దోబూచులాడుతోంది. 


అదే విధంగా తాడికొండ నుంచి టీడీపీ అభ్య‌ర్థి తెనాలి శ్రావ‌ణ్ కుమార్ గత ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అయితే, ఇప్పుడు ఈయ‌న‌కు టికెట్ విష‌యంలో అనేక త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల అనంతరం చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. ఇదే త‌మ‌కు ప్ల‌స్ అవుతుంద‌ని వైసీపీ అభ్య‌ర్థి శ్రీదేవి భావిస్తోంది. రాజ‌కీయాల‌కు కొత్తే అయినా.. ఈమె కూడా శ్రావ‌ణ్‌కు ధీటుగానే ప్ర‌చారం చేశారు. ఈ నేప‌థ్యంలో టీడీపీలో నెల‌కొన్ని అసంతృప్తి ఆమెకు ఏమేర‌కు ప్ల‌స్ అవుతుందో చూడాలి. ముచ్చ‌ట‌గా మూడో నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్తిపాడు. ఈ ద‌ఫా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌కు చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. ఇక్క‌డ నుంచి వైసీపీ సీనియ‌ర్ మేక‌తోటి సుచ‌రిత పోటీ చేశారు. వీరిద్ద‌రి మ‌ధ్య కూడా హోరా హోరీ పోరు సాగింది. అయితే, సుచ‌రిత‌పై సానుభూతి ప‌వ‌నాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. దీంతో ఈమూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ జెండా ఎగ‌రేస్తుందా?  లేదా ? అనే విష‌యం ఆస‌క్తిగా మారింది. ఇక్క‌డ వైసీపీ లేడీ లీడ‌ర్లు గెలిస్తే ఒకే జిల్లాలో ముగ్గురు మ‌హిళ‌ల‌ను ఎమ్మెల్యేగా చేసిన జ‌గ‌న్ సంచ‌ల‌నం క్రియేట్ చేసిన‌వ్య‌క్తే అవుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: