అసలు కంటే కొసరు ఎక్కువని అంటారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారి కంటే అప్పటికపుడు చేరిన వారు వీరభక్తులైపోతున్నారు. విశాఖ జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ పరిస్థితి ఇపుడు అలాగే ఉంది. ఆయన కాంగ్రెస్ రాజకీయాల నుంచి పుట్టి పెరిగారు. మధ్యలో వైసీపీలో ఓ వెలుగు వెలిగారు. అయిదేళ్ళ వనవాసం చేసిన తరువాత జగన్ని  కలసి కూడా మనసు మార్చుకుని  ఎన్నికల వేళ టీడీపీలో చేరిపోయారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ కొణతాల ఇపుడు ఏమీ ఆశించకుండా పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ఒకవేళ టీడీపీ గెలిస్తే తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన గంపెడాశ పెట్టుకున్నారు.


కొణతాల ఈ ఎన్నికల్లో బాగా తగ్గిపోయారు. తనకంటే రాజకీయంగా బాగా జూనియర్ అయిన వియ్యంకుడు, అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వెనక ఉండి ప్రచారం చేశారు. ఆయన్ని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఓ విధంగా పార్టీ కోసం అన్ని భేషజాలు వదులుకున్నారు. తన సత్తా చాటి బాబు ముందు చూపించాలని ఉబలాటపడ్డారు. ఐతే ఈసారి రూరల్ జిల్లాలో వైసీపీ గాలి బలంగా వీచింది. దాంతోనే అనేక  డౌట్లు పుట్టుకువస్తున్నాయి. అలాగే  ఏపీలో రాజకీయం కూడా మారుతుందని అంటున్నారు. అదే జరిగితే కొణతాల ఆశలు అడియాశేనని అంటున్నారు.


2004 నుంచి 2009 వరకూ అయిదేళ్ళ పాటు విశాఖ జిల్లాలో మంత్రిగా చక్రం తిప్పిన కొణతాల 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతోనే ఆయన రాజకీయం తారుమారు అయింది. ఆ తరువాత వైసీపీలో చేరినా ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో వెనకబడిపోయారు. జగన్ తో విభేదాలు  కూడా రావడంతో ఏ పార్టీలో చేరకుండా ఆయన చాన్నాళ్ళుగా ఇంటికే పరిమితం అయ్యారు. ఇపుడు టీడీపీలో చేరిన కొణతాలకు ఆ పార్టీ గెలుపు చాలా అవసరం. ఓ విధంగా తమ్ముళ్ల కంటే కూడా ఎక్కువగా ఆయన తపిస్తున్నారు.

సైకిలెక్కిన దానికి ప్రతిఫలంగా పార్టీ రావాలని, లేకపోతే రాజకీయంగా కనుమరుగేనని కొణతాల వర్గం భావిస్తోంది. ఇప్పటికే పదేళ్ళ పాటు అధికార పదవులకు దూరమైన కొణతాల మరో అయిదేళ్ళు వేచి ఉండడం అంటే కుదిరే పని కాదని అంటున్నారు. మరి టీడీపీ కోసం వేయి మొక్కులు మొక్కుతున్న కొణతాల మొర దేవుడు ఆలకిస్తాడా.


మరింత సమాచారం తెలుసుకోండి: