అవుననే అంటున్నారు పరిశీలకులు. అనంతపురం జిల్లాలోని హిందుపురం నియోజకవర్గం తెలుగుదేశంపార్టీకి కంచుకోటని చెప్పటంలో సందేహం అవసరం లేదు. ఎన్టీయార్ 1983లో పార్టీని పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికలో కూడా టిడిపి ఓడిపోలేదు. ఇటువంటి ఘన చరిత్రున్న టిడిపి గెలుపు మరో పార్టీపై ఆధార పడుందని ప్రచారం జరుగుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

 

సిట్టింగ్ ఎంఎల్ఏ హోదాలో చంద్రబాబునాయుడు బావమరది కమ్ వియ్యంకుడు బాలకృష్ణ ఇక్కడి నుండి రెండోసారి పోటీ చేశారు. నియోజకవర్గానికి బాలయ్య స్ధానికేతరుడైనా ఎన్టీయార్ మీదున్న అభిమానంతోనే కొడుకులు హరికృష్ణ, బాలయ్యలను జనాలు గెలిపించారు. మొదటిసారి గెలిచిన తర్వాత బాలకృష్ణ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పెద్దగా లేదనే చెప్పాలి.

 

అదే సమయంలో నేతలకు కూడా అందుబాటులో ఉండేవారు కారు. దాంతో ఇటు జనాల్లోను అటు పార్టీలోను బాలయ్యపై విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ నేపధ్యంలోనే రెండోసారి పోటీ చేసిన బాలయ్య గెలుపుకు ఏ అంశాలు సహకరిస్తాయనే విషయాన్ని నేతలే చెప్పలేకపోతున్నారు.

 

ఇక వైసిపి విషయం చూస్తే మహ్మద్ ఇక్బాల్ పోటీ చేశారు. ఈయన కూడా స్ధానికేతరుడే. కాకపోతే చదువుకున్నది, వివాహం చేసుకున్నది, మొదట్లో ఉద్యోగంలో చేరింది ఇక్కడే కాబట్టి విస్తృత పరిచయాలున్నాయి. అయితే ఇక్బాల్ కన్నా ముందు టికెట్ కోసం ప్రయత్నం చేసుకున్న నవీన్ నిశ్చల్, అబ్దుల్ ఘనీలు ఇక్బాల్ గెలుపుకు ఏ మేరకు సహకరించారన్నదే కీలకం.

 

చివరగా జనసేన తరపున పోటీ చేసిన ఆకుల ఉమేష్ స్ధానికుడే కాకుండా గట్టి అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్నారు. టిడిపి, వైసిపిలకు ధీటుగా ఉమేష్ కూడా పోటీ పడ్డారు. దాంతో ఉమేష్ చీల్చుకోబోయే ఓట్లు ఎవరివి అనే సందేహాలు అందరినీ పట్టి పీడిస్తున్నాయి. వైసిపికి పడే ఓట్లను గనుక జనసేన చీల్చుకుంటేనే బాలయ్య గెలుపు సాధ్యమంటున్నారు. అంటే బాలకృష్ణ గెలవాలంటే జనసేనే దిక్కని తేలిపోయిందట.

 


మరింత సమాచారం తెలుసుకోండి: