ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావుతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ కావటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని రామోజీరావు ఇంట్లో ఈ రహస్య సమావేశం జరిగింది. చంద్రబాబు.. రామోజీ ఇరువురూ ముఖాముఖిగా అనేక విషయాలు మాట్లాడుకున్నట్టు సమాచారం. రామోజీరావు కుమారుడు కిరణ్‌ తప్ప ఇతరులెవ్వరినీ ఈ భేటీకి అనుమతించలేదని తెలుస్తోంది.


అయితే, దీనిపై ర‌క‌ర‌కాల చ‌ర్చలు జ‌రుగుతున్నాయి.  ఓ ప్రయివేటు ఫంక్షన్‌లో పాల్గొనే నిమిత్తం హైదరాబాద్‌కు విచ్చేసిన చంద్రబాబు.. పనిలో పనిగా రామోజీతో భేటీ అయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై వారిరువురూ చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో పోలింగ్‌ సరళి, దాన్నిబట్టి ఏయే పార్టీలకు ఎన్నెన్ని సీట్లు రావచ్చనే అంశాలపై వారు మాట్లాడుకున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్‌ సారధ్యంలోని యూపీఏ... బలాబలాలు, అధికారాన్ని చేపట్టటానికి వాటికున్న అవకాశాల గురించి వారు చర్చించారు. కేసీఆర్‌ చెబుతున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ అంశం కూడా వారిద్దరి మధ్య చర్చకొచ్చింది. డీఎమ్‌కే అధ్యక్షుడు స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ కావటం.. ఆ వెంటనే డీఎమ్‌కే తాము కాంగ్రెస్‌ వైపే ఉంటామంటూ ప్రకటించటం, ఆ పార్టీ నేత మురుగన్‌ అమరావతికి విచ్చేసి చంద్రబాబుతో భేటీ కావటం తదితరాంశాలను ఏపీ సీఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈనెల 23న యూపీఏ భాగస్వామ్య పక్షాలు, మద్దతుదారుల సమావేశం ఉన్నందున అందులో ఏయే అంశాలను ప్రతిపాదించాలనే విషయమై సైతం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు పేర్కొంటున్నారు. 


అయితే, ఈ స‌మావేశపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ``ఏ సలహా, సహాయం కోసం రామోజీ రావుని కలిశావు చంద్రబాబూ? ప్రజాధనంతో హెలికాప్టర్‌లో వెళ్లి ఆయనను  కలవాల్సినంత ముఖ్యమైన పనేమిటో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా? ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఆశ్రయం పొందాలో అడగడానికా? కేసీఆర్‌తో రాజీ చేయమని ప్రాధేయపడటానికి వెళ్లావా? ఇంత దిగజారిపోయావేంటి బాబూ?``అంటూ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: