చివరి వరకు వచ్చి తెలుగుదేశంపార్టీ ఓడిపోతున్న ఈ నియోజకవర్గంలో ఈసారన్నా గెలుస్తుందో లేదో అన్న టెన్షన్ నేతల్లో పెరిగిపోతోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టిడిపి గడచిన మూడు ఎన్నికల్లో గిలిచిందే లేదు. 2004, 2009, 2014 ఎన్నికల్లో టిడిపి ప్రత్యర్ధులతో హోరా హోరీగా పోరాడిన ఓటమి తప్పలేదు. దాంతో ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో టిడిపి నేతలు పనిచేశారు.

 

గుంటూరు సిటీలో కీలకమైన నియోజకవర్గంలో తూర్పు కూడా ఒకటి. ఇక్కడి నుండి మొన్నటి ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్ధులూ ముస్లిం మైనారిటీ అభ్యర్ధులనే రంగంలోకి దింపాయి. టిడిపి నుండి యువనేత నసీర్ అహ్మద్, వైసిపి నుండి సిట్టింగ్ ఎంఎల్ఏ మొహ్మద్ ముస్తాఫా, జనసేన నుండి జియావుర్ రెహ్మాన్ రంగంలోకి దిగారు.

 

అభ్యర్ధుల్లో ఎవరికి వారే గట్టిగా కనిపిస్తున్నా టిడిపి, వైసిపి అభ్యర్ధుల గెలుపోటములు ప్రధానంగా జనసేన అభ్యర్ధిపైనే ఆధారపడున్నాయి. ఎందుకంటే, ఈ నియోజకవర్గంలో ఇతర సామాజికవర్గాలున్నా ముస్లింలు, వైశ్యుల ఓట్లే చాలా ఎక్కువ.  కాబట్టి వీళ్ళదే డిసైండింగ్ ఫ్యాక్టర్ అని తేలిపోతోంది. వీళ్ళల్లో  కూడా ముస్లింల ఓట్లు ఎక్కువగా ఎవరికి పోలయ్యాయనేదే అందరిలోను సస్పెన్సుగా మారింది.

 

టిడిపి, వైసిపి అభ్యర్ధులు తమ గెలుపుపై ధీమాతో కనిపిస్తున్నా జనసేన అభ్యర్ధి రెహ్మన్ చీల్చుకునే ఓట్లపైనే తమ భవిష్యత్ ఆధారపడుందన్న సంగతి లోలోపల వాళ్ళని కుదిపేస్తోంది. పైగా పోలింగ్ కూడా 70 శాతమే నమోదైంది. అంటే చాలా నియోజకవర్గాలతో పోల్చుకుంటే తక్కువనే చెప్పాలి. అభ్యర్ధుల టెన్షన్ ఒకవైపు వాళ్ళను కుదిపేస్తుంటే వీళ్ళపై బెట్టింగ్ రోజురోజుకు పెరిగిపోతుండటం గమనార్హం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: