ఏపీలో విప‌క్ష వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న అంచ‌నాలు ఆ పార్టీ నేత‌ల‌ను ఫ‌లితాల‌కు ముందే ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వ‌స్తే ఎవ‌రికి వారు త‌మ‌కే మంత్రి ప‌ద‌వులు, కార్పొరేష‌న్ ప‌ద‌వులు, ఇత‌ర కీల‌క ప‌ద‌వులు వ‌స్తాయ‌న్న ఊహాలోహాల్లో విహ‌రిస్తున్నారు. కొన్ని చోట్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థులు కాబోయే మంత్రివ‌ర్యులు అన్న హంగామా కూడా స్టార్ట్ చేసేశారు.  కృష్ణా జిల్లాలో జ‌గ్గ‌య్య‌పేట వైసీపీ అభ్య‌ర్థి సామినేని ఉద‌య‌భాను పేరిట జ‌రుగుతోన్న వాట‌ర్ బాటిల్స్ పంపిణీలో కాబోయే మంత్రివ‌ర్యులు అన్న హోదా కూడా ఇచ్చేసుకున్నారు.

ఇక రోజా లాంటి నేత‌లు కాబోయే హోం మంత్రి తామే అని చెప్పుకున్న‌ట్టు కూడా సోష‌ల్ మీడియాలో జోరుగా వైసీపీ వ‌ర్గాలే ప్ర‌చారం చేస్తున్నాయి. ఇక ప‌దేళ్ల పాటు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తోన్న వారంతా త‌మ క‌ల మ‌రో వారం రోజుల్లో తీరిపోనుంద‌ని సంబ‌రాలు కూడా స్టార్ట్ చేసుకుంటున్నారు. ఇక ఎవ‌రి లెక్క‌లు ఎలా ? ఉన్నా జ‌గ‌న్ మాత్రం ముగ్గురికే త‌న కేబినెట్‌లో చోటంటూ చెప్పాడు. ఈ ముగ్గురిలో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, లోకేష్ మీద గెలిస్తే మంగ‌ళ‌గిరిలో ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, ఒంగోలులో పోటీకి దిగిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ మాత్ర‌మే. మిగిలిన వారంతా త‌మ‌కే మంత్రి ప‌ద‌వులు అని అన‌ఫీషీయ‌ల్‌గా చెప్పుకుంటోన్న వారే.

ఇక సీన్ క‌ట్ చేస్తే వైసీపీలో మంత్రి ప‌ద‌వి కోసం జ‌గ‌న్ సామాజిక‌వ‌ర్గం నుంచి వెయిటింగ్లో ఉన్న వారి లిస్టు చాలానే ఉంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో నామినేటెడ్ ప‌రంగా చూస్తే అత్యంత కీల‌క‌మైన ప‌ద‌వి అయిన టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్క‌బోతోంది ? అన్న చ‌ర్చ ఆస‌క్తిదాయ‌క‌మే. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమ‌ర్నాథ్‌రెడ్డికే అన్న ప్ర‌చారం జ‌రిగింది. ఆయ‌న టీడీపీ నుంచి వ‌చ్చిన మేడా మ‌ల్లిఖార్జున‌రెడ్డి కోసం త‌న సీటు వ‌దులుకున్నారు. జ‌గ‌న్ ఎమ్మెల్సీ ఇస్తాన‌ని చెప్పినా త‌న‌కు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టడంతో జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్టు ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కోస్తాకు చెందిన ఓ సీనియ‌ర్ నేత ఈ ప‌ద‌వి మ‌క్కువ‌తో జ‌గ‌న్‌ను అడ‌గ‌గా కాదు కాదు.. అమ‌ర్నాథ్ అన్న‌కు మాట ఇచ్చాన‌ని జ‌గ‌న్ చెప్పిన‌ట్టు కూడా పుకార్లు షికార్లు చేశాయ్‌. ఇక తాజాగా ఇప్పుడు వైసీపీలోనే ఈ కీల‌క‌మైన ప‌ద‌వి కోసం పోటీ ఏర్ప‌డింది. టీటీడీ మాజీ చైర్మ‌న్‌, తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఇప్పుడు రేసులోకి దూసుకువ‌చ్చారు. ఆయన చిత్తూరు జిల్లా నుంచి మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్నారు. అయితే సీనియ‌ర్ పెద్దిరెడ్డి, మ‌హిళా కోటాలో రోజా, ఇక ఫైర్‌బ్రాండ్ చెవిరెడ్డి లాంటి వారు ఆయ‌న‌కు గ‌ట్టి పోటీదారులు. వీరంతా రెడ్డి సామాజిక‌వ‌ర్గం వారే. 

ఈ క్ర‌మంలోనే మంత్రి ప‌ద‌విపై ఆశ‌లు వ‌దులుకున్న భూమ‌న మంత్రి ప‌ద‌విపై మ‌క్కువ పెట్టుకోవ‌డం కంటే తిరిగి టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని ఆశిస్తేనే బెట‌ర్ అని ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో టీటీడీ చైర్మ‌న్‌గా ప‌నిచేసిన‌ప్పుడు త‌న స్పెషాలిటీ చూపించిన ఆయ‌న ఇప్పుడు మ‌రోసారి ఆ దిశ‌గానే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు భోగ‌ట్టా. ఏదేమైనా వైసీపీ ఇంకా అధికారంలోకి రాకుండానే ఈ ప‌ద‌వి కోసం పోటీ ఎక్కువైపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: