మ‌హాభార‌తంలో ధుర్యోధ‌నుడు అంద‌రిని దూరం చేసుకుని చివ‌ర‌కు ఒంట‌రిగా మిగిలిపోతాడు. త‌న సోద‌రులు అయిన పాండ‌వుల‌తో వైరం కొని తెచ్చుకున్న ధుర్యోధ‌నుడు పూర్తిగా ధ‌ర్మం త‌ప్పి వాళ్ల‌కు ఇవ్వాల్సిన అర్ధ‌రాజ్యం కూడా ఇవ్వ‌కుండా యుద్ధం చేసి ఓడిపోతాడు. ఇటు మేన‌మామ‌ల‌తోనూ వైర‌మే... త‌న త‌ల్లిదండ్రుల త‌ర‌పు అంద‌రి బంధువుల‌తోనూ వైరంతోనే రాజ్య‌పాల‌న చేసి చివ‌ర‌కు త‌న కెరీర్‌ను తానే ముగించుకుంటాడు. ఇప్పుడు ఏపీలో జ‌రిగిన ఈ ఎన్నిక‌లు మ‌హాభార‌త యుద్ధాన్నే త‌ల‌పించాయి. ఐదేళ్ల క్రితం బాబు ఇచ్చిన హామీలు ఎన్ని ?  వాటిలో నెర‌వేర్చిన‌వి ఎన్ని ?  ఆ త‌ర్వాత ఇచ్చిన కొత్త హామీలు ఎన్ని ?  చివ‌ర‌కు ఎన్నిక‌ల‌కు ముందు కొత్త‌గా తెర‌మీద‌కు తెచ్చిన హామీలు ఎన్ని ? ఇలా చెప్పుకుంటూ పోతే బాబు చెప్పిన‌వాటికి చేసిన‌వాటికి తేడా కొండంత‌.. గోరంత‌గా ఉంది.


ఇక ఐదేళ్ల పాల‌నాకాలంలో చంద్ర‌బాబు త‌న అనుకున్న వారంద‌రిని దూరం పెట్టుకున్నాడు. నాలుగేళ్ల పాటు ఎన్డీయేలో చేరి బీజేపీతో అంట‌కాగ‌డంతో పాటు మంత్రి ప‌ద‌వులు కూడా అనుభ‌వించిన ఆయ‌న చివ‌ర‌కు ఎన్టీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక బీజేపీతో తీవ్ర‌మైన వైరుధ్యం కొని తెచ్చుకున్నాడు. చివ‌ర‌కు మోడీ టార్గెట్‌గా చంద్ర‌బాబు చేసిన రాజ‌కీయం దెబ్బ‌తో బీజేపీ సైతం ఈ సారి ఏపీలో చంద్ర‌బాబు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అధికారంలోకి రాకూడ‌ద‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసింది. మోడీకి మ‌మ‌తాబెన‌ర్జీ, ఇటు చంద్ర‌బాబు బ‌ద్ధ శ‌త్రువులుగా మారిపోయారు.


ఇక గ‌తంలో త‌న వ‌ద్దే ప‌నిచేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌తో అన‌వ‌స‌రంగా పెట్టుకుని కొరివితో త‌ల‌గోక్కున్న‌ట్లు అయ్యింది. చంద్ర‌బాబు దెబ్బ‌కు తెలంగాణ‌లో క‌ష్టంగా గెల‌వాల్సిన కేసీఆర్ చాలా సులువుగా గెలిచిపోవ‌డంతో పాటు బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ ఈ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓట‌మికి తెర‌వెన‌క చేయాల్సింది అంతా చేసేశారు. ఇక రాజ‌కీయంగా త‌న‌కు క‌ష్టాల్లో వెన్నంటే ఉన్న వారిని కాద‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌ల అభిప్రాయానికి విరుద్ధంగా టీడీపీకి ద‌శాబ్దాల రాజ‌కీయ శ‌త్రువు అయిన కాంగ్రెస్‌తో చేతులు క‌లిపాడు. ఇది కూడా తెలంగాణ ఎన్నికల్లో బూమ‌రాంగ్ అవ్వ‌డంతో పాటు టీడీపీ ప‌రువు తీసేసి తెలంగాణ‌లో పార్టీని స‌మాధి చేసేసింది.


ఇక చంద్ర‌బాబు నాలుగేళ్ల‌లో ఎంత వ‌ర‌కు పోల‌వ‌రం, అమ‌రావ‌తి అంటూ హ‌డావిడి చేశారే త‌ప్పా ఈ రెండిట్లో ఏదీ పూర్తి కాలేదు. ఇక సామాజిక‌వ‌ర్గాల వారీగా చూస్తే బ్రాహ్మ‌ణులు, ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలతో పాటు టీడీపీకి సంప్ర‌దాయ ఓటు బ్యాంకుగా ఉంటోన్న బీసీల్లో కొన్ని కులాల్లో కూడా ఈ సారి మార్పు స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇక హ‌రికృష్ణ మృతితో వ‌చ్చిన సానుభూతిని తెలంగాణ ఎన్నిక‌ల్లో వాడుకోవాల‌ని చూసిన బాబు ఆయ‌న కుమార్తె సుహాసినిని కూక‌ట్‌ప‌ల్లిలో పోటీ పెట్టడం.. ఆమె ఓడిపోవ‌డంతో ఈ సారి నంద‌మూరి వీరాభిమానుల్లో కూడా మార్పు వ‌చ్చింది. అటు జూనియ‌ర్ ఎన్టీఆర్‌కే కాకుండా ఆయ‌న మామ నార్నె శ్రీనివాస‌రావు, ఇటు హ‌రికృష్ణ ఫ్యామిలీని కూడా బాబు దూరం చేసుకున్నారు. 


ఇక చంద్ర‌బాబు తోడ‌ళ్లుడు ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు బాబునే విబేధించి వైసీపీలోకి వెళ్లిపోయారు. ఈ ఎన్నిక‌ల్లో ద‌గ్గుపాటి ఏకంగా ప‌ర్చూరు నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. ఇక ద‌గ్గుపాటి భార్య పురందేశ్వ‌రి బీజేపీ నుంచి ఏకంగా బాల‌య్య చిన్న అల్లుడు భ‌ర‌త్ మీదే ఎంపీగా పోటీ చేసింది. ఏదేమైనా చంద్ర‌బాబు సొంత కుటుంబంలోనే కాకుండా రాజ‌కీయంగా త‌న‌కు అన్ని విధాలా దూరంగా ఉన్న పార్టీల‌కు కూడా దూర‌మైపోయి అభిన‌వ ధుర్యోధ‌నుడిగా మిగిలిపోయారు. మ‌రి రేప‌టి ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఆయ‌న ఏం చేస్తారో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: