ఆయన పూసపాటి వంశాధీశుడు. ఎన్నో యుధ్ధాలను ఆరితేరిన ఘనుడు. ఆయన సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్. కేంద్ర మంత్రిగా నాలుగేళ్ళ పాటు విజయవంతంగా తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చిన పూసపాటి అశోక్ గజపతిరాజు విజయన‌గరంలో మేటి నాయకుడు. టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్. రాజు గారు మళ్ళీ హస్తినలో అడుగుపెడతారా...విజయనగరం పూసపాటి వంశస్థుడు, రాజకీయ దురంధరుడు , కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రాజకీయ కార్యక్షేత్రం  అశోక్ బంగ్లా ఇపుడు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతోంది.


గత నెలలో జరిగిన పోలింగ్ విషయంలో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన అశోక్ పార్టీలోని ముఖ్య నాయకులకు క్లాస్ తీసుకున్నారని భోగట్టా. అన్ని విధాలుగా పార్టీ పరంగా, వ్యక్తిగతంగా సహకరించినా కొంతమంది నాయకులు ఎన్నికల వేళ పార్టీకి  బొత్తిగా  పనిచేయలేదని అశోక్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. పార్టీని దెబ్బ తీసిన వారి జాబితా ఇపుడు అశోక్ వద్ద ఉందని అంటున్నారు. అటువంటి వారికి ఇకపై అశోక్ బంగ్లాలో స్థానం ఉండదని గట్టి హెచ్చరికలు కూడా జారీ అయ్యాయని తెలిసంది.


విజయనగరం మండలంలో వైసీపీకి పెద్దగా పట్టు లేదని, అయినా అక్కడ టీడీపీ కంటే కూడా ఎక్కువ ఓట్లు రావడానికి కారణం పసుపు పార్టీలోని విభీషణులేనని అశోక్ బంగ్లా అసలు గుట్టు తేల్చింది. దాంతో అశోక్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారట. తాను, కుమార్తె అతిది గజపతి రాజు కచ్చితంగా గెలల్వాల్సిందేనని తేడా వస్తే మాత్రం వూరుకోబోమని చెప్పినా కూడా నేతలు ఇలా చేయడంపైన అశోక్ మండిపడుతున్నారని చెబుతున్నారు. విజయనగరం ఎమ్మెల్యే విషయానికి వస్తే కోలగట్ల వీరభద్రస్వామి అతిదికి గట్టి పోటీ ఇచ్చారని అంటున్నారు. అలాగే  లోక్ సభ సీటు విషయంలో అశోక్ తో ఏ మాత్రం సరి తూగ లేని వైసీపీ అభ్యర్ధి బెల్లాల చంద్రశేఖర్ రాజు గారికి చమటలు పట్టించారని పోస్ట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. దీంతోనే అశోక్ బంగ్లాలో వేడి వాడి చర్చలు గత కొన్ని రోజులుగా వరసగా సాగాయని అంటున్నారు.


ఇంత జరిగినా అశోక్ గెలుపు విషయంలో కొంత ధీమా కనిపిస్తోందట. వైసీపీలోని పెద్ద తలకాయల నుంచి చివరి నిముషంలో తగిన సహాయం ఇటి వైపు లభించినట్లుగా చెబుతున్నారు. దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉన్నా పార్టీలు వేరుగా ఉన్నా ఆ తెర వెనక బంధం కొనసాగుతోందని అంటున్నారు. టీడీపీ నేతలు దెబ్బ వేస్తే అటు నుంచి దానికి సరి సమానంగా సహాయం అందిందని, ఫలితంగా గెలుపు అవకాశాలు పెరిగాయని కూడా పోలింగ్ సరళి మీద అశోక్ బంగ్లా చేసుకున్న సమీక్షలో వెల్లడైందట. ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా సొంత పార్టీ నేతలు కొందరు ఏకంగా రాజు గారికే వెన్ను పోటు పొడిచారన్నది ఇపుడు విజయనగరంలో పెద్ద చర్చగా సాగుతోంది. అసలు నిజం ఏంటన్నది 23న ఎన్నికల ఫలితాలే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: