ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై టీడీపీ మ‌రోమారు కొత్త ఆరోప‌ణ‌లు చేసింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చంద్రగిరి నియోజక వర్గంలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో(అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు) రీపోలింగ్‌ జరగనుంది. అయితే, . సీఎస్ సూచనల మేరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది రీపోలింగ్ కు సిఫార్సు చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.


చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ ముగిసిన 34 రోజుల తర్వాత రీపోలింగ్ జరపడం విడ్డూరంగా ఉందని టీడీపీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఇన్ని రోజుల తర్వాత ఆదేశించడం చూస్తుంటే ఎన్నికల ప్రక్రియలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం హస్తం స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

కాగా, రీపోలింగ్‌లో భాగంగా, 321-ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, 104- పులివర్తి వారి పల్లి, 316- కొత్త ఖండ్రిగ, 318-కమ్మపల్లి, 313-వెంకట రామాపురం పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌కే రుడోలా నోట్‌ విడుదల చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: