ఫలితాల తేది దగ్గర పడుతున్న కొద్ది టెన్షన్ వాతావారణం పెరిగిపోతోంది. కౌంటింగ్ రోజున ఉద్దేశ్యపూర్వకంగా అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఇంటిలజెన్స్ కు సమాచారం అందిందట. దాంతో లా అండ్ ఆర్డర్ పోలీసులు కుట్రను ఛేదించేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ జరిగిన రోజున దాదాపు ఏడు జిల్లాల్లో వైసిపి ఎంఎల్ఏ అభ్యర్ధులతో పాటు కార్యకర్తలపై దాడులు జరిగిన విషయం తెలిసిందే.

 

కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏకపక్షంగా జరుగుతోందన్న అసహనంతో ఓటింగ్ రోజున నరసరావుపేట వైసిపి అభ్యర్ధి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల అభ్యర్ధి కాసు మహేష్ రెడ్డి, కురుపాంలో పాముల పుష్ప శ్రీవాణి, పూతలపట్టులో డాక్టర్ బాబు తదితరులపై దాడి చేసి గాయపరిచిన విషయం అందరూ చూసిందే. అలాగే తాడిపత్రి, పుంగనూరులో జరిగిన అల్లర్లలో ఇద్దరు మరణించారు.

 

పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకునే ఫలితాలు వచ్చే రోజు మరింత గొడవలు జరగొచ్చని పోలీసు శాఖ అనుమానిస్తోంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో కూడా అల్లర్లకు అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ సమాచారం.

 

 

పోలింగ్ రోజున చెలరేగిన అల్లర్లను కట్టడి చేయటంలో పోలీసులు విఫలమయ్యారనే చెప్పుకోవాలి. ఎందుకంటే, అధికారపార్టీ నేతలే ప్లాన్ ప్రకారం ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు.  కార్యకర్తలపై దాడులు జరిగాయంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ ఏకంగా అభ్యర్ధులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పాముల పుష్ఫ శ్రీ వాణి పైన దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారంటే ఏమనుకోవాలి. సిట్టింగ్ ఎంఎల్ఏల హోదాలో వాళ్ళకు భద్రత ఉన్నా కూడా వాళ్ళపై దాడులు జరగితే ఏమనుకోవాలి ?

 

సరే రేపటి కౌంటింగ్ రోజున ఎవరు గెలుస్తారన్నది వేరే విషయం. కానీ వైసిపినే అధికారంలోకి వచ్చేస్తోందనే ప్రచారమైతే ముమ్మరంగా జరుగుతోంది. ఆ ప్రచారాన్ని కూడా చంద్రబాబునాయుడు అండ్ కో తట్టుకోలేకున్నారు. నిజంగానే వైసిపి గెలిస్తే అధికారాన్ని అప్పగించటం టిడిపికి ఏమాత్రం ఇష్టం లేదని తెలిసిపోతోంది. అధికారమార్పిడి జరిగే సమయంలోనే అల్లర్లు జరిగేందుకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: