చిత్తూరు జిల్లా చంద్ర‌గిరిలో రీపోలింగ్ ఎపిసోడ్ చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ``పోలింగ్‌ జరిగిన నెల తర్వాత రీపోలింగ్‌ కోసం వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడం కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. ఎక్కడైనా, ఎవరైనా పోలింగ్‌లో అక్రమాలు జరిగినట్టు భావిస్తే అదే రోజు, లేదంటే మరుసటి రోజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారు. కానీ వైసీపీ నెల త‌ర్వాత చేసింది`` అంటూ టీడీపీ ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది.


అయితే, ఈ ఆరోప‌ణ‌ల్లో నిజ‌మెంత అనే విష‌యంపై తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి  అంబటి రాంబాబు వెల్ల‌డించారు. చంద్ర‌గిరిలో దళితులతో ఓటు వేయించకుండా అక్కడి అగ్రవర్ణాలు అడ్డుపడ్డారని త‌మ‌ పార్టీ చంద్రగిరి అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని అంబ‌టి వివిరంచారు. ``చంద్రగిరిలో ఏడు కేంద్రాలలో రీపోలింగ్ నిర్వ‌హించాలని ఏప్రిల్ 12వ తేదీన  మా అభ్యర్థి ఫిర్యాదు చేశారు. దానిపై కూలంకషంగా విచారించి ఈసి ఐదు కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘంకు అన్ని సాక్ష్యాధారాలు అందచేసిన తర్వాతనే ఈ నిర్ణయం వెలువడింది.అయినా...దీనిపై చంద్రబాబు,తెలుగుదేశం పార్టీ నానా హడావుడి చేస్తున్నారు.`` అని మండిప‌డ్డారు


చంద్రబాబు రీపోలింగ్ అప్రజాస్వామికం అని ప్రకటిస్తున్నారు, రీపోలింగ్ అప్రజాస్వామికమ‌ని ఎలా చెబుతారని అంబ‌టి ప్ర‌శ్నించారు. ``చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే అసలు ఎన్నికలే అప్రజాస్వామ్యం అన్నట్లుగా ఉంది. చంద్రబాబు తీరు చూస్తే శాశ్వతంగా తానే ముఖ్యమంత్రిగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనో రాజులాగా వారి అబ్బాయి యువరాజులా ఉండాలని భావిస్తున్నట్లున్నారు. వెబ్ క్లిప్పింగ్ లలో దృశ్యాలు సరైనవా కావా అనేది తెలుగుదేశం పార్టీ స్పష్టం చేయాలి. ఓటమి భయంతో చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. విషయాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రగిరిలో ఐదు కేంద్రాలలో రీపోలింగ్ జరిపితే టిడిపికి భయమెందుకు? రీపోలింగ్ వల్ల ఏదో గందరగోళం జరుగుతుందని చచ్చు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఈవిఎంలపై,వివిప్యాట్లపై,ప్రజాస్వామ్యంపై,ఎన్నికలపై,ప్రజలపై విశ్వాసం లేదు.
-ఆయనకు ఎవరిపై దేనిపై విశ్వాసం ఉందో చెప్పమనండి`` అని రాంబాబు వివ‌రించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: