ఏపీలో సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఏపీ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఏకంగా 35 రోజుల పాటు ఇప్పటికే సుదీర్ఘంగా నిరీక్షించిన అభ్యర్థులు అందరూ మరో ఐదు రోజుల పాటు ఉత్కంఠను ఎదుర్కోకతప్పడం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఐదు రోజుల సమయం మాత్రమే ఉండడంతో టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, మంత్రులు చాలామంది కంటి మీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నారు. ఈ విషయాన్ని మీడియా వర్గాలకు ఆఫ్ ద రికార్డుగా వాళ్ళే చెబుతుండటం కొసమెరుపు.  ఏపీలో వైసీపీ గాలులు బలంగా ఉన్నాయన్న నివేదికలు ఇప్పటికే వెలువడ్డాయి. ఇక పార్టీ ఓడిపోవడం సంగతి పక్కన పెడితే బాబు క్యాబినెట్ లో ఏకంగా ఎనిమిది నుంచి పది మంది మంత్రులు కూడా ఓటమి బాటలోనే ఉన్నట్టు వెలువడుతున్న అంచనాలు, నివేదికలు ఇప్పుడు ఆ మంత్రుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేస్తున్నాయి. 


ఐదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే ఓడిపోతే తమ పరిస్థితి ఏంటని, తాము ఎలా తలెత్తుకొని తిరగాలన్నా ఆందోళన వారిలో కనిపిస్తోంది. తమ గెలుపుపై తీవ్రమైన ఆందోళనతో ఉన్న మంత్రుల‌లో ప్రధానంగా ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఐదేళ్లపాటు పోలవరం, పట్టిసీమ, అసెంబ్లీలో జగన్‌ను ఎలా ? తిట్టాలి, వైసీపీని ఎలా ప‌త‌నం చెయ్యాలి అన్న దానిపైనే దృష్టి పెట్టిన ఉమా సొంత నియోజ‌క‌వ‌ర్గం మైల‌వ‌రం అభివృద్ధిపై దృష్టి పెట్ట‌లేదు. చివరిలో నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకం నీళ్లు వచ్చేస్తున్నాయి... అంటూ నానా హడావుడి హంగామా చేయడం ఉమాకే చెల్లింది.  ఈ సారి నియోజకవర్గంలో ఉమాకు ధీటుగా  దేవినేని ఫ్యామిలీ చిరకాల రాజకీయ శత్రువు అయిన వసంత కృష్ణప్రసాద్ రంగంలో ఉన్నారు. 


కృష్ణ ప్రసాద్ సామాజిక, ఆర్థికంగా ఉమాకు సరిసమానమైన ప్రత్యర్థి కావడంతో నియోజకవర్గ ప్రజలు ఈ సారి మార్పు కోరుతున్నట్టు తేటతెల్లమైంది. ఈ క్రమంలోనే చివరి రెండు మూడు నెలల్లో ఉమా కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైపోయారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన ఆపసోపాలు పడక తప్పలేదు. ఇక టెక్కలిలో మంత్రి అచ్చన్నాయుడు పరిస్థితి సైతం అలాగే ఉంది. పోలింగ్ ముగిశాక అచ్చ‌న్నాయుడు ఎక్కడ కనపడటం లేదు అన్న టాక్ వినిపిస్తోంది. మీడియా ముందుకు వస్తే జగన్‌ను వైసీపీని ఏకేసే అచ్చన్న పోలింగ్ ముగిశాక సైలెంట్ అయిపోవటం వెనక ఆయన గెలుపుపై ఆయనకే చాలా సందేహాలు ఉండటమే కారణంగా కనిపిస్తోంది. సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  ఈ సారి గెలవకపోతే తన రాజకీయ భవిష్యత్తుకు పులిస్టాప్ పడిపోయినట్టే అన్న ఆందోళనతో ఉన్నారు.


గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, పితాని సత్యనారాయణ సైతం గట్టిపోటీ ఎదుర్కొన్నారు. ఆచంటలో పితాని గెలుపు కష్టమే అంటున్నారు. తిరువూరులో మంత్రి జవహర్‌కు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి నుంచి చాలా తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియ, రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులు, ఎంపీలుగా పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి, సిద్ధ రాఘవరావు వైసిపి అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారు. ఏదేమైనా ఈ సారి  పది మంది మంత్రులు వైసీపీ నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్నారు. మరి వీరిలో ఎవరు రేపటి ఫలితాల్లో ఒడ్డున ప‌డతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: