ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా సంయుక్త విలేక‌రుల స‌మావేశం ఢిల్లీలో నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ,  'అనూహ్యంగా ప్రధాని మోదీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఎన్నికలు ముగియడానికి నాలుగైదు రోజుల ముందు మీడియా ముందుకొచ్చారు మోదీ ఏ గదిలో మాట్లాడుతున్నారో ఆ గది తలుపులు వేసినట్టు నాకు చెప్పారు. మా తరఫున కొన్ని ప్రశ్నలు అడగాల్సిందిగా ఇక్కడ ఉన్న కొందరు జర్నలిస్టులను కోరారు. కానీ వాళ్లని అనుమతించినట్టు లేదు' అని వెటకారం చేశారు. ఎన్నిక‌ల సంఘం పాత్ర‌పై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయ‌ని రాహుల్ అన్నారు.  


ప్ర‌ధాని మోదీ మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించ‌డం అసాధార‌ణ విష‌య‌మ‌ని రాహుల్ ఎద్దేవా చేశారు. అనేక అంశాల‌పై త‌నతో చ‌ర్చించేందుకు మోదీ ఎందుకు సిద్ధంకాలేద‌ని రాహుల్ ప్ర‌శ్నించారు. రాఫెల్ అంశంపై చ‌ర్చ‌కు ర‌మ్మ‌న్నా ఎందుకు రాలేదు అని ఆయ‌న అడిగారు. ఈ సంద‌ర్భంగా మీడియాపైనా రాహుల్ చిర్ర‌బుర్రులాడారు. ``మీడియా వాళ్లు కూడా నన్ను కఠినమైన ప్రశ్నలు అడుగుతూ.. మోదీని మాత్రం దుస్తులు, మామిడి పండ్ల గురించి ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కంటే మోదీ, భాజపా వద్ద చాలా రెట్లు డబ్బు ఎక్కువగా ఉంది. కానీ మా దగ్గర నిజం మాత్రమే ఉంది. ఆ నిజమే గెలుస్తుంది’ అని రాహుల్‌ అన్నారు.


మోదీ, బీజేపీ వ‌ద్ద లెక్క‌లేనంత డ‌బ్బు ఉన్న‌ద‌ని, వాళ్లు మార్కెటింగ్ కూడా ఎక్కువే చేశార‌ని రాహుల్ అన్నారు.``మోదీ తెరవగలిగిన తలుపులను ఓ పద్ధతి ప్రకారం మూసేస్తూ వచ్చాం. ఆయన తలుపులు 90 శాతం మేం మూసేశాం. మిగతా 10 శాతం ఆయనే మూసుకున్నారు. బీజేపీతో మేం పోరాడాం. మోదీ, ఆర్ఎస్ఎస్ నుంచి ఈ దేశ వ్యవస్థలను రక్షించాం' అని తెలిపారు. మా క‌న్నా బీజేపీ ఎక్కువ ప్ర‌చారం చేసింద‌ని, అది సుమారు 1-20 శాతం తేడాతో ఉన్న‌ద‌ని, కానీ మా ద‌గ్గ‌ర కేవ‌లం స‌త్యం మాత్ర‌మే ఉంద‌ని, స‌త్య‌మే విజ‌యం సాధిస్తుంద‌ని రాహుల్ అన్నారు.  మోదీ, షా సిద్ధాంతాలు గాంధీ సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకమన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి మోదీ మరోసారి ప్రయత్నిస్తున్నారని, అయితే అది జరగదని ఎద్దేవాచేశారు. 


తాజా ఎన్నికల్లో ఈసీ పారదర్శకంగా వ్యవహరిస్తోందని, మోదీ షెడ్యూల్‌ ప్రకారమే ఉత్తర్వులు ఇస్తోందని రాహుల్‌ దుయ్యబట్టారు. 'ప్రధాని తనకిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఈసీ ఆయననేమీ అనకుండా పక్షపాతంతో వ్యవహరించింది. మోదీ ప్రచారానికి అనుకూలంగా ఉండేలా మొత్తం ఎన్నికల షెడ్యూల్ తయారు చేశారని రాహుల్ ఆరోపించారు. ఎవరెన్ని చేసినా చివరికి సత్యమే గెలుస్తుంది` అని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: