ప్రధానిగా అయిదేళ్ళ పాటు మీడియా ముందుకు రాలేదు. నోరు విప్పలేదు. ఎటువంటి క్లిష్ట సమస్య వచ్చినా కూడా మీడియాతో పంచుకోని అరుదైన ప్రధానిగా మోడీ పేరు తెచ్చుకున్నారు.  వివిధ సభల్లో అనర్గళంగా ప్రసంగాలు చేసే మోడీ మీడియాను ఉద్దేశించి మాత్రం ఎపుడూ నోరు విప్పలేదు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్న వేళ మోడీ ప్రధాని హోదాలో మీడియా మీట్లో పాల్గొనడం విశేషం. అయితే ఎక్కువగా ఆయన మీడియా ప్రశ్నలకు స్పందించకపోవడం కూడా విశేషమే.


ఇదిలా ఉండగా,  పూర్తి మెజారిటీతో కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లలో మంచిపాలన అందించామని, మరోసారి అధికార పగ్గాలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులు మరోసారి ఉంటాయని ఆశిస్తున్నానని అన్నారు. తుదివిడత పోలింగ్‌ ప్రచారం ముగించుకుని ఈ రోజు సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు   అమిత్‌ షాతో కలిసి ప్రధాని మోదీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు.


భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్యమని గర్వంగా చెప్పగలనని, ప్రపంచాన్ని శాసించే శక్తిగా భారత్‌ ఎదగాలని ఆకాంక్షించారు. సోషల్‌ మీడియా రాకతో బాధ్యత రెట్టింపైందని అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మేనిఫెస్టోలో పలు అంశాలు పొందుపరిచామని చెప్పారు. కాగా సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ గాడ్సేకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని అన్నారు. ఎన్నికలు జరుగుతున్నాయని ఐపీఎల్‌ను వేరే దేశాలకు తరలించాల్సిన పరిస్థితి ఎదురుకాలేదని వ్యాఖ్యానించారు.


బీజేపీ చరిత్రలో విస్తృతంగా ప్రచారం చేసిన ఎన్నికలు ఇవని ఆ పార్టీ చీఫ్‌ అమిత్‌ షా అన్నారు.2014లో చారిత్రక తీర్పుతో అధికారంలోకి వచ్చామని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రధాని మోదీ శ్రమించారని చెప్పారు. గతం కంటే భారీ మెజార్టీతో కేంద్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి బీజేపీ అద్భుతమైన, చారిత్రాత్మకమైన విజయాన్ని సాధిస్తుందని మోడీ అమిత్ షా ద్వయం చెప్పుకున్నారు.


దేశవ్యాప్తంగా తమ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, లక్షా ఆరు వేల శక్తి కేంద్రాల ద్వారా పార్టీ బలోపేతమైందని చెప్పుకొచ్చారు.ప్రజలు బీజేపీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని అన్నారు. ఇప్పటివరకూ బీజేపీ గెలుపొందని ప్రాంతాల్లోనూ దృష్టిసారించామన్నారు. కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యం కాదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: