తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హించే వేడుక‌ల విష‌యంలో మ‌రింత మెరుగ్గా కార్య‌క్ర‌మాలు ఉండేలా కేసీఆర్ మార్పులు చేశారు. జాతీయ, రాష్ట్ర పండుగల నిర్వహణకు అనుసరించాల్సిన పద్ధతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, అధికారులు పాల్గొన్న ఈ సద‌స్సులో  స్వాత్రంత్య‌, గణతంత్ర, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రస్తుత పద్ధతిలోనే నిర్వహించాలా? ఏమైనా మార్పులు చేయాలా? అనే విషయంపై సమావేశంలో చర్చ జరిగింది.

 
భారత  స్వాత్రంత్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా, మరింత వైభవంగా నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రజలకు, విద్యార్థులకు, పోలీసులకు పెద్ద యాతన లేకుండా ఈ మూడు ఉత్సవాలను గొప్పగా, సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా నిర్వహించడానికి ప్రత్యామ్నాయ  పద్ధతులు ఆలోచించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాలను పిలిపించి ఎండలో కవాతు నిర్వహించడం, విద్యార్థులను కూడా రప్పించి ఎండలో ఇబ్బంది పెట్టడం లాంటి కార్యక్రమాలు కొనసాగించవలసిన అవసరం ఉందా? లేదా? అనే విషయాలపై చర్చ జరిగింది.

‘‘రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న జరుగుతుంది. ఆ రోజు విపరీతమైన ఎండ ఉంటుంది. వడగాల్పులు కూడా ఉంటాయి. అప్పుడు పాఠశాలలకు సెలవులుంటాయి. ఈ సమయంలో విద్యార్థులను ఇండ్ల నుంచి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. ఎండలో కవాతు చేయడం వల్ల పోలీసులు, విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయిన సందర్భాలున్నాయి. తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. పరేడ్ గ్రౌండ్ కూడా ఉత్సవాల నిర్వహణకు అనువుగా లేదు’’  అని సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు. 


పరేడ్ గ్రౌండ్‌కు బదులుగా పబ్లిక్ గార్డెన్ లోని జూబిలీ హాల్ కు ఎదురుగా ఉన్న మైదానంలో ఉత్సవాలు నిర్వహిస్తే సబబుగా ఉంటుందని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రతిపాదించారు. ఇతర అధికారులు కూడా దీన్ని అంగీకరించారు. పబ్లిక్ గార్డెన్ కు, జూబిలీహాల్ కు చారిత్రిక ప్రాధాన్యం కూడా ఉందని వారు వివరించారు. పోలీసులు, విద్యార్థులతో కవాతు నిర్వహించే పద్ధతికి చాలా రాష్ట్రాలు స్వస్తి పలికాయని, తెలంగాణలో కూడా ఉత్సవాలలో కవాతులను మినహాయించడం సముచితంగా ఉంటుందని చెప్పారు.

పతాకావిష్కరణ, ముఖ్య అతిథి ప్రసంగాలకే పరిమితం కాకుండా, ఎట్ హోం, కవి సమ్మేళనాలు, అవార్డుల ప్రదానోత్సవాలు కూడా నిర్వహించాలని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం నాటి సమీక్ష సమావేశంలో వచ్చిన అభిప్రాయాల నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర పండుగలు ఎక్కడ నిర్వహించాలి? ఎలా నిర్వహించాలి? ప్రస్తుతం అనుసరిస్తున్న సంప్రదాయాలు, పద్ధతుల్లో ఏమైనా మార్పులు అవసరమా? అనే అంశాలపై సీనియర్ అధికారులతో చర్చించి, రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె..జోషిని ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: