ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు ఈసీపై భ‌గ్గుమ‌న్నారు. చంద్రగిరిలోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రీ పోలింగ్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరాను ఢిల్లీలో కలిశారు. పది పేజీల విజ్ఞాపన పత్రాన్ని బాబు అందజేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఈసీపై మండిప‌డ్డారు. ఇలాంటి ఈసీని నేనెప్పుడూ చూడలేదని చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 


ఏపీలో ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశాలు ఎలా జారీ చేస్తారని నిలదీసినట్టు చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. టీడీపీ ఫిర్యాదులను పట్టించుకోకుండా వైఎస్సార్సీపీ ఫిర్యాదులను మాత్రమే ఈసీ పరిగణలోకి తీసుకుంటుందని సునీల్ అరోరా దృష్టికి తీసుకెళ్లామ‌ని చంద్ర‌బాబు అన్నారు.  వైసీపీ ఫిర్యాదు చేసిన వెంటనే రీపోలింగ్‌కు ఆదేశించడంపై అసహనం వ్యక్తం చేశారు.

సాధారణంగా ఎన్నికలు జరిగిన మరుసటి రోజు రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా రీపోలింగ్‌కు ఆదేశిస్తారని.. కానీ సుమారు నెల రోజులు దాటినప్పటికీ ఏపీలో వైకాపా ఫిర్యాదు మేరకు ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు ఏకపక్షంగా, వివాదాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు.


ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని , మోదీ, అమిత్‌షా చెప్పిన ప్రకారం ఈసీ నడుచుకుంటోందని చంద్ర‌బాబు ఆరోపించారు. ఈసీ పని తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలపాల్సి రావడం చాలా దురదృష్టకరమని అన్నారు. 24 ఏళ్లుగా తాను తెదేపా అధ్యక్షుడిగా ఉన్నానని, జాతీయ రాజకీయాలను చూశానని పేర్కొంటూ...ఈ విధమైన ఎన్నికల సంఘాన్ని మాత్రం ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: