ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్ ఆరోరాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ జరపాలన్న నిర్ణయ ఏకపక్షం, వివాదాస్పదం అని మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ దోస్తీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 


ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు విపక్షపార్టీలు బలంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో కేంద్రం ఆదేశాలతో ఈసీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రధానమంత్రి మోదీ తీరు.. ఆయన బలహీనతను సూచిస్తోందని విమర్శించారు. మోదీకి వ్య‌తిరేకంగా త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌న్నారు. బీజేపీ, ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా కలిసి పనిచేస్తామని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత టీఆర్ఎస్ పార్టీతో దోస్తీపై స్పందించారు.  


ఈనెల 23వ తేదీన యూపీఏ చైర్‌ప‌ర్స‌న్ సోనియాగాంధీ సార‌థ్యంలోని యూపీఏ సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్ఎస్‌కు ఆహ్వానం అందినట్టు వార్తలొచ్చాయని.. ఒకవేళ కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ కలిసి వచ్చినా పనిచేస్తారా అని విలేఖరులు చంద్రబాబును ప్రశ్నించారు. 'ఎవరు కలిసి వచ్చినా పని చేస్తాం. మరీ హైపోథిటికల్‌ ప్రశ్నలు వద్దు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరొచ్చినా కలుస్తాం. ఏ పార్టీపైనా వివక్ష అక్కర్లేదు' అని సమాధానమిచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: