విశాఖ ఉత్తరం అసెంబ్లీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు విజయంపై పందేలు జోరుగా సాగుతున్నాయి. ఓటమెరుగని వీరుడిగా ఉన్న గంటా ఈసారి గెలుస్తారా అన్నది పెద్ద చర్చగా ఉంది. ఇదివరకు పోటీ చేసిన చోట్ల గంటా విజయం విషయంలో ఇంత టెన్షన్ ఉండేది కాదు. ఇపుడు మాత్రం మొదటి నుంచి తడబాట్లు, పొరపాట్లు చాలా జరిగిపోయాయి. అసలు భీమిలి నుంచి గంటా చివరి నిముషంలో షిఫ్ట్ కావడంతో ఆయనకు ప్రచారానికి కూడా టైం సరిపోలేదు. మరో వైపు ఆయన కూడా పెద్దగా ప్రచారంపై ద్రుష్టి పెట్టలేదని సొంత పార్టీ నుంచే విమర్శలు ఉన్నాయి.


గంటా వినాయకులనే నమ్ముకున్నారు తప్ప పనిచేసే వారిని కాదని అప్పట్లోనే తమ్ముళ్ళు అసంత్రుప్తి వ్యక్తం చేశారు. కుల నాయకులను వెంట తిప్పుకుంటే గెలుపు సులువు అనుకున్న గంటాకు అదే రివర్స్ అయిందని పోలింగ్ సరళి రుజువు చేసిందని అంటున్నారు. చిత్రమేంటంటే గంటా మీద తాము గెలుస్తామని ప్రత్యర్ధులు అయిన ఇద్దరు రాజులు ఇప్పటికీ మీసాలు మెలివేయడమే. పోలింగ్ ముగిసిన నెల రోజుల్లో ఇప్పటికి మూడు విడతలుగా సమీక్ష నిర్వహించిన వైసీపీ అభ్యర్ధి కే కే రాజు అన్ని రకాల పోస్ట్ పోల్ సర్వేలను దగ్గర పెట్టుకుని మరీ లెక్కలు వేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ మెజారిటీ ఇరవై వేలకు తగ్గదని ఆయన ధీమాగా ఉండడమే కాకుండా క్యాడర్ కి కూడా అదే చెబుతున్నారు.


తాను గంటా మాదిరిగా అప్పటికపుడు వచ్చినవాడిని కాదని, చాలాకాలంగా లోకల్ గా ఉంటున్నానని, దాదాపు ఆరు నెలల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకున్నానని ఆయన చెప్పుకొస్తున్నారు. వైసీపీ గాలి కూడా బాగా ఉందని, ఇక పార్టీ క్యాడర్ ప్రాణం  పెట్టి పనిచేశారని, ఈసారి ఎలాగైనా రావాలన్న కసి వారిలో కనిపించిందని అంటున్నారు.  ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న నార్త్ లో బాబు వ్యతిరేక ఓటు తనకే కలసివచ్చిందని కూడా ఆయన చెబుతున్నారు. అదే విధంగా బీజేపీ అభ్యర్ధి విష్ణుకుమార్ రాజు కూడా తన గెలుపు ఖాయమని అంటున్నారు. ఇక గంటాకు ఈసారి మరో దెబ్బగా జనసేన పోటీ అని  చెబున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఉషాకిరణ్ పోటీ చేయడం వల్ల ఇక్కడ ఆ సామాజిక వర్గం ఓట్లలో భారీగా చీలిక వచ్చిందని అంటున్నారు.


వెలమ సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ ఎక్కువే కానీ అదే సామాజిక‌ వర్గానికి  చెందిన మరో మంత్రి అయ్యన్నతో గంటాకు ఉన్న వైరం మూలంగా ఆ వర్గం ఓట్లు వైసీపీకి పడ్డాయని పోలింగ్ అనంతర సర్వేలు చెబుతున్నాయి. ఈసారి చిత్రమేంటంటే అధికారం చేతిలో ఉండి కూడా టీడీపీ ఓటర్లను తాయిలాలతో ఆకట్టుకోవడంలో వెనకబడిపోయిందని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ అనుకున్నది జాగ్రత్తగా చేసుకుందని, అది తమకు  బాగా మైనస్ అయిందని టీడీపీ శిబిరంలో చర్చ సాగుతోంది. ఇక గంటా గెలుపు పై పందేలు బాగా జరుగుతున్నాయి. ఆయన మెజారిటీ కూడా తగ్గుతుందని, అయినా గెలుస్తారని అంటుంటే, వైసీపీ విజయం ఖాయమని కూడా పందేలు జోరుగా సాగుతున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: