అవును.. సరిగ్గా 12 ఏళ్లవుతోంది. ఆ ఘోరం జరిగి.. 2007 మే 18న మధ్యాహ్నం 1.15 గం.ల సమయం..  హైదరాబాద్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మక్కా మసీదు ఆవరణలోని వజూఖానా వద్ద ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్  బాంబు పేలింది.


ఈ బాంబు పేలుళ్లలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.  58 మంది గాయపడ్డారు. సమీపంలోనే పేలని మరో ఐఈడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో టీవీ నైన్ ఛానల్ కొత్తగా ప్రారంభించిన సంస్కృతి ఛానల్‌ కోసం మక్కా మసీదు దృశ్యాలు రికార్డు చేస్తున్న సమయంలో ఈపేలుడు చోటు చేసుకోవడంతో టీవీ నైన్‌ పేలుడు దృశ్యాలు లభించాయి. 

ఈ కేసులో సీబీఐ నిందితుల ఛార్జీషీట్లో సునీల్ జోషి పేరు ఉంది. 29 డిసెంబర్ 2007లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో అతను చనిపోయాడు. 2010లో హిందూ గ్రూప్ అభినవ్ భారత్ సభ్యుడు స్వామి అసిమానాందను సీబీఐ అరెస్ట్ చేసింది. దేవేందర్ గుప్తా, లోకేష్ శర్మ అనే మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసింది.

మక్కా మసీదు పేలుడు ఘటనలో తన పాత్రను అసీమానంద అంగీకరించాడు. 2017లో హైదరాబాద్ కోర్టు అసీమానందకు బెయిల్ ఇచ్చింది. ఏడేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. 2018లో ఈ కేసులో ఐదుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. నిందితులపై నేరారోపణలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: