అమరావతి అంతర్జాతీయ స్ధాయి రాజధానిగా తయారవ్వటం సంగతి తర్వాత ముందు వివిధ నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మాత్రం షెల్టర్ జోన్ గా మారిపోయినట్లే కనిపిస్తోంది. తెలంగాణాలో నేరాలకు పాల్పడటం, బయటపడగానే పోలీసుల నుండి తప్పించుకోవటానికి ఏపికి వచ్చేయటం మామూలైపోయింది. ఓటుకునోటు కేసుతో మొదలైన ఈ పరంపర టివి9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు ఆశ్రయిం ఇచ్చారనే ఆరోపణల దాకా పాకింది.

 

తెలుగురాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన కొత్తల్లోనే తెలంగాణాలో ఓటుకునోటు కేసు బయటపడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ కేసు దేశంవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కెసియార్ ప్రభుత్వాన్ని కూలదోయటమే లక్ష్యంగా చంద్రబాబునాయుడు అండ్ కో పెద్ద స్కెచ్చే వేశారని అప్పట్లో టిఆర్ఎస్ నేతలు ఎంత గోల చేసింది అందరూ చూసిందే. ఆ కేసులో ఇరుక్కున వాళ్ళల్లో రేవంత్ రెడ్డి రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డారు. అదే సమయంలో సహ నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న సండ్ర వెంకటవీరయ్య, జెరూసలేం మత్తయ్యలు చాలా కాలం తెలంగాణా పోలీసులకు పట్టుబడలేదు. వారిద్దరు కొంతకాలంఅమరావతిలోనే దాక్కున్నారనే ఆరోపణలున్నాయి.  

 

తర్వాత ఈమధ్య కాలంలో బయటపడిన ఐటి గ్రిడ్స్ కేసులో కీలక వ్యక్తి అశోక్ ఇప్పటికీ పోలీసులకు పట్టుబడలేదు. కేసు వెలుగు చూసినప్పటి నుండి అమరావతిలోనే ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా టివి9 మాజీ సీఈవో రవిప్రకాశ్ వ్యవహారం కూడా అలాగే ఉంది. రవిప్రకాశ్, నటుడు శివాజిలపై పోలీసులు అనేక సెక్షన్ల క్రింద కేసులు పెట్టారు.

 

ఆ కేసులను కూడా వీళ్ళు లెక్క చేయటం లేదు.  వీళ్ళు కూడా అమరావతిలో తలదాచుకున్నారనే ఆరోపణలకైతే కొదవలేదు. అంటే ఏపిలో ప్రభుత్వం అండదండలుంటే చాలు ఎటువంటి నేరాలకు పాల్పడినా షెల్టర్ కు ఇబ్బందులు లేదని అనుకుంటున్నట్లున్నారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వివిధ నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలుగుదేశంపార్టీతో సంబంధాలున్నవాళ్ళే. అందులోను చంద్రబాబుకు బాగా సన్నిహితులు కూడా. చంద్రబాబు అండ చూసుకునే యధేచ్చగా చెలరేగిపోయారనే అనుకోవాలి. కాకపోతే ఖర్మకాలి కేసుల్లో తగులుకున్నారు. వీళ్ళందరి వ్యవహారం చూస్తుంటే అమరావతి నేరగాళ్ళకు షెల్టర్ జోన్ గా మారినట్లు అనిపించటం లేదూ ?


మరింత సమాచారం తెలుసుకోండి: