టీవీ9-అలందా మీడియా వివాదంలో మ‌రో కీల‌క అప్‌డేట్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ వివాదంలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన మాజీ సీఈఓ ర‌విప్ర‌కాశ్‌, సినీ న‌టుడు శివాజీ పాత్ర‌, గ‌త కొద్దికాలంగా వారు ఎవ‌రికీ అందుబాటులోకి రాక‌పోవ‌డం వంటి ప‌రిణామాల మ‌ధ్య తాజాగా శివాజీ స్పందించారు. ఓవీడియో విడుద‌ల చేసి త‌న అభిప్రాయాలు తెలిపారు. అయితే, ఈ వీడియో ద్వారా త్వ‌ర‌లో తాను పోలీసుల ముందుకు రానున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించ‌డం...ఏదో సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ వ‌లే ఉంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. 


శివాజీ త‌ను విడుద‌ల చేసిన వీడియోలో ... కుట్రలో భాగంగానే తనను ఇరికించారని ఆరోపించారు. తాను పారిపోయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేద‌ని, తానెక్కడికి పారిపోలేదని.. సన్‌స్ట్రోక్ తగిలి రెస్ట్ తీసుకుంటున్నట్లు చెప్పారు. సోషల్‌ మీడియా ద్వారా కొందరు శునకానందం పొందుతున్నారని, సమయం వచ్చింది కాబట్టి ఏమైనా చేస్తారని వాపోయారు. తనపై రాళ్లు విసిరితే అవి వారికే తగులుతాయని మండిప‌డ్డారు. అనవసరంగా తనపై టీవీల్లో డిబేట్లు పెట్టొద్దన్నారు. 


ఇక తాజా వివాదం గురించి స్పందిస్తూ, 2018లో తాను షేర్లు కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని చెప్పారు. యాజమాన్యం మారింది కాబట్టి షేర్ల గురించి అడిగానని, ఇందులో తప్పేముందని ప్ర‌శ్నించారు. రవిప్రకాశ్‌, తనకు మధ్య జరిగిన షేర్ల బదిలీ సివిల్ పంచాయితీ అని.. అనవసరంగా దాన్ని క్రిమినల్ పంచాయితీ చేశారని వాపోయారు. త‌మ‌ ఒప్పందంలో జోక్యం చేసుకోడానికి కౌశిక్‌రావు ఎవరు? అని ప్రశ్నించారు. మై హోమ్ అధినేత రామేశ్వరరావు తనకు బాగా తెలుసన్నారు. ఆయన పిలిచి అడిగితే అన్నీ చెప్పేవాడినన్నారు.


పోలీసు కేసులు, వివాదం గురించి స్పందిస్తూ, కౌశిక్‌రావు ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు మా ఇంటిపై దాడి చేసి నానా హంగామా చేశారన్నారు. సోదాలు చేసి ఏమీ దొరకలేదని తెలిపారు. తన భార్యతో సంతకం చేయించుకొని వెళ్లిపోయారని వివరించారు. తనపై వంద కేసులు కాదు.. వెయ్యి పెట్టుకున్న భయమేమీలేదన్నారు. ఇవన్నీ సిల్లీ కేసులంటూ కొట్టిపారేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం తనపై పగ పట్టిందన్నారు. ఇందులో కొంతమంది ఆంధ్రా నాయకులు కూడా ఉన్నారని ఆరోపించారు. తాను హైదరాబాద్‌లో సెటిలర్‌నని, స్థానబలం లేదని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 


వడదెబ్బ తగిలి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాన‌ని పేర్కొంటూ నిజాయితీగా బయటికి వస్తానని.. నాలుగు రోజుల తర్వాత పోలీసుల దగ్గరకు వెళ్తానని శివాజీ ప్ర‌క‌టించారు. ‘పోలీసులు ఏమైనా నన్ను చంపేస్తారా? ఏంటి’ అని చిత్ర‌మైన కామెంట్లు చేశారు.  నెహ్రూ 9 ఏళ్లు జైల్లో ఉన్నారు.. ఆయనకేమైనా అయిపోయిందా? అని నిలదీశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: