కీల‌క‌మైన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓటరు మ‌నోగ‌తం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో నిక్షిప్తమైంది. ఇక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు ఓటర్ల మనోగతంపై నిర్వహించిన సర్వే ఫలితాలను ఆదివారం సాయంత్రం విడుదల చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రధానిగా నరేంద్రమోదీ మళ్లీ అధికారాన్ని చేపడుతారని పరోక్షంగా పేర్కొన్నాయి. దాదాపు 15 సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించగా, మూడు మినహా అన్ని సంస్థలు ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజారిటీ లభిస్తుందని అంచనా వేశాయి. మూడు సంస్థలు మాత్రమే హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశముందని పేర్కొన్నాయి. 


ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ షాకులు మొద‌ల‌య్యాయ‌ని అంటున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి తాజాగా ఈ షాక్ ఇచ్చారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆమె ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇచ్చారు. సోనియా, రాహుల్ గాంధీల‌తో పాటు విపక్ష పార్టీల నాయకులతో మాయావ‌తి సోమవారం భేటీ అవుతారని ఆదివారం వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే, ఆమె నో చెప్పారు. 


బీఎస్పీ సీనియర్ నాయకులు సతీశ్ చంద్ర మిశ్రా ఢిల్లీ స‌మావేశంపై స్పష్టత ఇచ్చారు. మాయావతి ఇవాళ ఎవరితోనూ భేటీ కావడం లేదని స్పష్టం చేశారు. ఇవాళ మాయావతి లక్నోలోనే ఉంటుందని, ఢిల్లీ వెళ్లడం లేదని ఆయన చెప్పారు. ఎన్డీఏనే మళ్లీ అధికారంలోకి వస్తుందని నిన్న వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేప‌థ్యంలో...కాంగ్రెస్ పార్టీతో మాయావ‌తి దూరం పెంచుకుంటున్నార‌ని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: