ఓవైపు కౌంటింగ్ కౌంట్ డౌన్ ద‌గ్గ‌ర‌ప‌డ‌టం మ‌రోవైపు ఎగ్జిట్ పోల్స్‌లో విప‌క్షాల‌కు షాకిచ్చేలా ఎన్డీఏనే రాబోయే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తుంద‌న్న జోస్యం నేప‌థ్యంలో...ఢిల్లీ వేదిక‌గా రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డుతోంది. ఇప్ప‌టికే వివిధ పార్టీలు త‌మ ఆలోచ‌న దోర‌ణిని మార్చుకున్నాయ‌నే చ‌ర్చ‌లు తెర‌మీద‌కు రాగా...తాజాగా బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన శివ‌సేన మ‌రింత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. బీజేపీకి వ్య‌తిరేకంగా కూట‌మి క‌డుతున్న ప్ర‌తిప‌క్షాలపై శివ‌సేన మండిప‌డింది.
శివ‌సేన అధికారిక పత్రిక అయిన సామ్నా ప‌త్రిక‌లో  ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ చేసింది. చిన్న‌పార్టీల‌ను జ‌త చేసుకుని జ‌ట్టు క‌డుదామ‌నుకుంటున్న ప్ర‌య‌త్నాల‌న్నీ వీగిపోతాయ‌ని శివ‌సేన హెచ్చ‌రించింది.  మే 23న ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చే లోపు ప్ర‌తిప‌క్షంలోని పార్టీల‌న్నీ విడిపోతాయ‌ని శివ‌సేన పేర్కొన్న‌ది. ఏపీ సీఎం చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను సామ్నా నిల‌దీసింది. అటూ ఇటూ తిరుగుతూ చంద్ర‌బాబు ప్ర‌యాస‌ప‌డుతున్నార‌ని శివ‌సేన పేర్కొంది. ఎన్నిక‌ల త‌ర్వాత అస్థిర ప‌రిస్థితి వ‌స్తుంద‌ని, దాని నుంచి లాభం పొందేందుకే చంద్ర‌బాబు ఢిల్లీలో క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని, కానీ అది నిజం కాదు అని సామ్నా తెలిపింది. చంద్ర‌బాబు కూట‌మి కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, కానీ ఆయ‌న ప్ర‌య‌త్నాలు విఫ‌లం అవుతాయ‌ని, ఢిల్లీలో రెండుసార్లు శ‌ర‌ద్ ప‌వార్‌ను క‌లిశార‌ని, కానీ ఆ కూట‌మి 23వ తేదీ వ‌ర‌కు క‌లిసి ఉంటుంద‌న్న న‌మ్మ‌కం లేద‌ని శివ‌సేన ప‌త్రిక వెల్ల‌డించింది.
ఈ సంద‌ర్భంగా కూట‌మి నేత‌ల గురించి సైతం సామ్నా ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. మ‌హాకూట‌మి నుంచి క‌నీసం అయిదు మంది ప్ర‌ధాని ప‌ద‌వి కోసం పోటీప‌డుతున్నార‌ని, వారి క‌ల‌ల‌న్నీ ప‌టాపంచ‌లు కాబోతున్న‌ట్లు సామ్నా త‌న ఎడిటోరియ‌ల్‌లో తెలిపింది. చిన్న చిన్న పార్టీల కూట‌మితో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే ప‌రిస్థితి లేద‌ని సామ్నా చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: