చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్‌ రోజు అక్రమాలు జరిగినట్లు బలమైన సాక్ష్యాధారాలు ఉన్నందునే ఐదుచోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా అక్రమాలు జరిగినట్లు నిర్ధరణకు వచ్చామన్నారు. వాస్తవాలను దాచి..ప్రశాంతంగా పోలింగ్‌ జరిగిందని నివేదికలు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. సస్పెండ్‌ చర్యలు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపిన విషయం తెలిసిందే. 


చంద్రగిరిలోని ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం, పులివర్తిపల్లెలో గత నెల 11న ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులపై ఈసీ కొరడా ఝుళిపించింది.  పోలింగ్‌ రోజునాటి సీసీ ఫుటేజీలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా? అని కూడా అనిపించింది. ప్రైవేటు వ్యక్తులు సైతం పోలింగ్‌ బూత్‌ల్లోకి ప్రవేశించారు. రిగ్గింగ్‌ జరిగినట్లు తేలింది. దీనిపై సమగ్ర నివేదిక పంపిన అనంతరం భారత ఎన్నికల కమిషన్‌ రీపోలింగ్‌ జరపాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.  ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఆఫీసర్లు(పీవో), ఏపీవోలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.


ఈ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.  ఐదు పోలింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడిన.. అనధికార వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కూడా ఈసీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నిన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఏడు ప్రాంతాల్లో రీ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. 


కాగా,  చంద్రగిరిలోని ఈ ఐదు గ్రామాల్లో ఎన్నికల  సందర్భంగా అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం నిన్న ఈ ఐదు గ్రామాలతో పాటు కాలేపల్లి, కుప్పం బాదూరులోనూ రీపోలింగ్ నిర్వహించింది. ఈసీ విచారణలో ఇక్కడ పోలింగ్ సందర్భంగా అక్రమాలు జరిగినట్లు తేలడంతో చర్యలు తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: