ఫలితాల తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ వైసిపినే ప్రభుత్వంలో వస్తుందనే అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. దాంతో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఉండబోయేది వీరేనంటూ చాలా రకాల జాబితాలే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే పార్టీలోని సీనియర్ నేతల సమాచారం ప్రకారం మొదటిసారి ఎంఎల్ఏలుగా గెలవబోయే వారికి సాధ్యమైనంత వరకూ మంత్రివర్గంలో చోటు దక్కటం కష్టమేనట.

 

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్ధానాలను లెక్కలోకి తీసుకుంటే మంత్రివర్గం సంఖ్య 15 శాతానికి మించకూడదు. అంటే ముఖ్యమంత్రి కాకుండా 25 దాకా మంత్రులుంటారు. ఏ ముఖ్యమంత్రయినా మొత్తం సంఖ్యను ఒకేసారి భర్తీ చేసేయరు. కాబట్టి జగన్ కూడా ఓ 20 మందితో క్యాబినెట్ ఏర్పాటు చేస్తారని  అనుకుంటున్నారు. ఇందులో ఎన్నికల ప్రచారంలో కానీ అంతకుముందు పాదయాత్రలో కానీ ఐదుగురికి బహిరంగంగానే మంత్రిపదవులను ప్రకటించారు. కాబట్టి ఇంకో 15 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది.

 

జగన్ ప్రకటించిన వారిలో చిత్తూరు జిల్లా కుప్పంలో పోటీ చేసిన చంద్రమౌళి ఉన్నారు. సరే చంద్రబాబునాయుడు మీద ఈయన గెలుపు కష్టమనుకుందాం. ఇక గుంటూరులో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్, ప్రకాశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, తూర్పు గోదావరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. వీరిలో మర్రిని ఎంఎల్సీని చేసి మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. ఇక ముగ్గురిలో గెలిచేదెవరూ చూడాలి. వీరిలో నలుగురు గెలిస్తే మరో 16 మందికే ఛాన్సుంటుంది.

 

మిగిలిన 16 మందిలో చిత్తూరు జిల్లా నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గంగాధర నెల్లూరులో నారాయణస్వామి, కడపలో మైనారిటీ కోటాలో ఒకరుంటారు. కర్నూలు జిల్లా డోన్ లో పోటీ చేసిన బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, అనంతపురం జిల్లా రాయదుర్గంలో గెలిస్తే కాపు రామచంద్రారెడ్డికి అవకాశం ఉంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పోటీ చేసిన ఆళ్ళ నానికి అవకాశమట. తూర్పులో విశ్వరప్ కు కూడా అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుండి ఆదిమూలపు సురేష్ కు అవకాశం ఉందట.

 

కృష్ణా జిల్లా గుడివాడలో పోటీ చేసిన కొడాలి నానికి, పెనమలూరులో గెలిస్తే పార్ధసారధికి కానీ అవకాశం  అంటున్నారు. పార్ధసారధి ఇవ్వకపోతే నెల్లూరులో సిటీలో గెలిస్తే అనీల్ కుమార్ యాదవ్ కే ఎక్కువ అవకాశాలున్నాయని సమాచారం. అలాగే విశాఖపట్నం జిల్లాలోని భీమిలీలో గెలిస్తే అవంతి శ్రీనివాస్ కే ఛాన్స్.  ఇక విజయనగరం జిల్లా నుండి బొత్సా సత్యనారాయణ, కురుపాం నుండి పాముల పుష్ప శ్రీవాణి గ్యారెంటీ అట. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు సోదరుల్లో ఒకరికి ఖాయమనే అంటున్నారు.  

 

సామాజికవర్గాల సమతూకం తీసుకుంటే రెడ్లలో నలుగురికి, కమ్మవాళ్ళల్లో ఇద్దరికి, బిసిల్లో నలుగురికి, ఎస్టీల్లో   ఒకరికి, ఎస్సీల్లో ముగ్గురు, గుంటూరు జిల్లా బాపాట్ల నుండి కోన రఘుపతిని బ్రాహ్మణ కోటాలో, విజయవాడ పశ్చిమలో వెల్లంపల్లి శ్రీనివాస రావులకు అవకాశం ఉందని సమాచారం. ఉన్నంతలో అన్నీ సామాజికవర్గాలను సర్దుబాటు చేయాలి కాబట్టి ఎక్కువ మంది గెలిచినా రెడ్ల శాతం తగ్గిపోతోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: