చూడబోతే పరిస్దితులు అలగే కనిపిస్తున్నాయి. మొన్నటి వరకూ ఏదో కాస్త అనుమానంగా ఉన్నా ఎగ్జిట్ పోల్ సర్వేల తర్వాత అనుమానాలు కాస్తా నిజాలయ్యేట్లుగా ఉన్నాయి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నట్లు చంద్రబాబునాయుడుకు ముందే స్పష్టమైన సమాచారం ఉందట. కాకపోతే కేంద్రం విషయంలోనే కాస్త కన్ఫ్యూజన్  ఉండేది. అందుకే చంద్రబాబు తన ఫోకస్ అంతా ఎక్కువగా మోడి వ్యతిరేక వ్యవహారలపైనే పెట్టారు.

 

ఎన్నికలు జరుగుతున్నపుడు కూడా కేంద్రంలో హంగ్ తప్పదని, అధికారంలోకి వచ్చేందుకు యూపిఏకే అవకాశాలున్నాయంటూ చంద్రబాబు ఒకటే ఊదరగొట్టిన విషయం అందరూ చూసిందే. అదే సమయంలో సంఖ్యాబలం తగ్గినా అధికారంలోకి వచ్చేందుకు  మళ్ళీ ఎన్డీఏకే అవకాశాలున్నాయని మామూలు జనాలు కూడా చెప్పుకుంటున్నారు.

 

యూపిఏ అధికారంలోకి వస్తుందన్న విషయంలో జనాల్లో ఎవరికీ పెద్దగా భ్రమలు లేవు. ఎందుకంటే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ ఏమంత బలంగా లేదని తెలిసిపోతోంది. జనాలకు తెలిసినంత చిన్న విషయం కూడా చంద్రబాబుకు తెలీలేదంటే ఆశ్చర్యంగా ఉంది. కేంద్రంలో రేపటి ప్రభుత్వం యూపిఏనే అని కాబోయే ప్రధానమంత్రి రాహూల్ గాంధీనే అంటూ చంద్రబాబు తెగ హడావుడి చేశారు.

 

రాహూల్ ను వెనకేసుకుని చంద్రబాబు మాట్లాడటంతో మమతాబెనర్జీ, మాయావతి ఇబ్బంది పడినట్లు వార్తలు వచ్చాయి. అసలు చంద్రబాబు ఎందుకింత హడావుడి చేశారంటే కేవలం తన స్వీయ రక్షణ కోసమే అని ఎవరైనా చెప్పేస్తారు. జగన్ సిఎం అయితే చంద్రబాబు అండ్ కోపై కేసులు పడతాయని, ఇప్పటికే  కోర్టుల్లో ఉన్న కేసులు స్పీడవుతాయని చాలామంది అనుకుంటున్నదే.

 

ఈ నేపధ్యంలోనే కేంద్రంలో గనుక తాను కాస్త యాక్టివ్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటే కేసుల నుండి ఏదో రకంగా  ఇమ్యూనిటీ వస్తుందని అనుకున్నారు. చంద్రబాబు అనుకున్నది ఒకటైతే జరగబోతున్నది మరోటిలాగ కనిపిస్తోంది. కేంద్రంలో మళ్ళీ మోడి ప్రధాన మంత్రయి, రాష్ట్రంలో జగన్ సిఎం అయితే చంద్రబాబు పరిస్ధితేంటో ఎవరికి వారుగా అంచనా వేసుకోవాల్సిందే. చంద్రబాబు ఏదైతే జరక్కూడదని అనుకుంటున్నారో చివరకు అదే జరుగుతోంది. మరి 23 తర్వాత చంద్రబాబు ఏం చేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: