రాష్ట్రంలో హోరా హోరీగా సాగిన ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల‌య్యేందుకు మూడురోజుల స‌మ‌యం ఉంది. అయితే, ఆదివారం సాయంత్రం దేశ‌వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యం పూర్తిగా ముగిసిన నేప‌థ్యంలో ఎగ్జిట్ పోల్ ప‌ల్స్ వెల్ల‌డ‌య్యాయి. ఈ స‌ర్వే ఫ‌లితాల్లో రాష్ట్రానికి చెందిన సంస్థ‌ల ప‌నితీరు ఎలా ఉన్నా.. దేశంలోని నేష‌న‌ల్ మీడియా మాత్రం మొత్తంగా వైసీపీకే ప‌ట్టం క‌ట్టింది. ప్ర‌జ‌లు మొత్తంగా వైసీపీ వెంటే ఉన్నార‌ని స్ప‌ష్టం చేసింది. మెజారిటీ సంస్థ‌లు వైసీపీకే జై కొట్టాయి. ప్ర‌జ‌లు మార్పు కోరుకున్నార‌ని, చంద్ర‌బాబును వ‌ద్ద‌నుకున్నార‌ని ఈ సంస్థ‌లు స్ప‌ష్టం చేశాయి. ప్రతిష్టాత్మక ఇండియాటుడే సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీకి 130–135 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. 


టీడీపీ 37–40 సీట్లకే పరిమితం కానుందని పేర్కొంది. జనసేనకు ఒక్క సీటు లేదంటే అది కూడా రాకపోవచ్చని విశ్లేషిం చింది. ఇక ఎంపీ సీట్లు వైఎస్సార్‌సీపీకి 18–20, టీడీపీకి 4–6 వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు ఒక స్థానం దక్కే అవ కాశం కూడా ఉందని తెలిపింది.  టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌లో వైసీపీకి 98 అసెంబ్లీ సీట్లు లభించగా టీడీపీకి 65 సీట్లు రావచ్చ ని తెలిపింది. జనసేనకు 2 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. వైసీపీకి 18 ఎంపీ సీట్లు, టీడీపీకి 7 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది. వీడీపీ అసోసియేట్స్‌ వైఎస్సార్‌సీపీకి 111–121 స్థానాలు, టీడీపీకి 54–60 సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్ లో తెలిపింది. ఇతరులు 4 చోట్ల గెలుపొందవచ్చున‌ని స్ప‌ష్టం చేసింది. 


ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబు మాట‌ల‌ను, ఆయ‌న చేసిన పాల‌న‌ను కూడా ప్ర‌జ‌లు పెద్ద‌గా విశ్వ‌సించ లేదేని స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపాయని పలు సర్వేల్లో తేలింది. ఆరా, సీపీఎస్‌ తదితర సంస్థలు కులాలవారీగా కూడా సర్వే చేశాయని, అన్ని సామాజిక వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపారని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, గౌడ, క్షత్రియ, బోయ, రజక తదితర కులాల ప్రాతిపదికగా కూడా సర్వే చేశారు. అన్ని వర్గాల్లోనూ జగన్‌ పట్ల ఆదరణ కనిపించింది. చంద్రబాబు పసుపు – కుంకుమ పథకం వల్ల మహిళలు ఎక్కువగా టీడీపీకి  ఓట్లు వేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే మహిళల ఓట్లు వైఎస్సార్‌ సీపీకే పడ్డాయని ఆయా స‌ర్వేలు చెప్ప‌డం ఆస‌క్తిగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: