నియాన్ లైట్ల వెలుతురులో నా న‌గ‌రం వెలిగి పోతోంది. గుండె గుండెలో ప్రేమ జ‌ల్లుల‌ను చ‌ల్లుకుంటూ. రంజాన్ వేళ‌ల్లో నిండు చంద‌మామ క‌దులుతూ వుంటే..లాడ్ బ‌జార్ లో గాజుల గ‌ల‌గ‌ల‌లు హృద‌యాల‌పై చెర‌గ‌ని రాగాల‌ను అద్దుతాయి. అప్పుడే పూసిన పూలు..విచ్చుకున్న పెద‌వుల మ‌ధ్య న‌వ్వుల కేరింత‌లు..కుల‌మ‌తాల‌కు అతీతంగా జ‌నం ఒక‌రినొక‌రు చూసుకుంటూ స‌ముద్రంలోని ఇసుక రేణువుల్లా త‌చ్చ‌ట్లాడుతూ వుంటే ..మ‌ళ్లీ ప్రేమ‌త‌న‌పు జ్ఞాప‌కాలు మ‌న‌సులో చిగురిస్తాయి. ప్రేమంటే గుండెల క‌ల‌యిక‌. తాను ప్రేమించిన ..త‌న కోసం జీవితాన్ని అర్పించిన భాగ్‌మ‌తి కోస‌మే క‌దా ఈ న‌గ‌రం రూపు దిద్దుకున్న‌ది. అదే భాగ్య‌న‌గ‌ర‌మై భాసిల్లుతోంది.


 కోట్లాది ప్ర‌జ‌ల ఆత్మ‌ల‌న్నీ ఒక్క‌టై న‌గ‌రాన్ని అల్లుకు పోయేలా చేస్తోంది. ఈ ప్రాంతంలో అడుగు పెడితే చాలు ప్రేమ ఉప్పొంగుతుంది. వెల్లువ‌లా చుట్టేస్తుంది. అటు చూస్తే చార్మినార్ ..న‌గ‌ర‌పు వాసుల ఉమ్మ‌డి ఆస్తి. ప్ర‌పంచానికే పాఠం నేర్పిన చ‌రిత్ర ఈ న‌గ‌రానిదే. త‌రాలు మారినా వ‌న్నె త‌గ్గ‌లేదు. అప్ర‌హ‌తిహ‌తంగా త‌న ఖ్యాతిని దిగంతాల‌కు వ్యాపించేలా భాగ్య‌న‌గ‌రం త‌న‌ను తాను మ‌లుచుకుంది. ప్రేమ కోసం కోట్లాది రూపాయ‌ల ఆస్తుల‌ను , లెక్క‌కు మించిన నోట్ల క‌ట్ట‌ల‌ను..మోయ‌లేని ఆభ‌ర‌ణాలు, వ‌జ్ర వైఢూర్యాల‌ను వ‌దిలేసుకుని ..ఇంగ్లండ్ నుండి హైద‌రాబాద్ ను వెతుక్కుంటూ వ‌చ్చిన ప్యాట్రిక్ ను ఎలా మ‌రిచి పోగ‌లం. 


ప్ర‌పంచంలో ఎక్క‌డికి వెళ్లినా ఏదో ఒక క‌థ ఉంటుంది. కానీ భాగ్య‌నగ‌రానికి మాత్రం ఘ‌న‌మైన చ‌రిత్ర వుంది..అది రెండు హృద‌యాలు మ‌మేక‌మై పోయిన క‌న్నీటి క‌థ‌. ఒక‌రి కోసం ఇంకొక‌రు ఆరాట ప‌డి..పోగేసుకున్న వైనం ..ఎప్ప‌టికీ ఎన్న‌టికీ చెరిగి పోకుండా నిలిచి పోయింది. ప్ర‌తి క‌థ‌కు ముగింపు వుంటుంది. కానీ ఈ భాగ్య‌న‌గ‌రం మాత్రం ప్రారంభ‌మే కానీ ఎండింగ్ అంటూ లేదు. ప‌రిపాల‌నాద‌క్షుడిగా..మాన‌వ‌త్వానికి ప్ర‌తీక‌గా..ప్రేమికుడిగా ..ఆరాధ‌కుడిగా..త‌న న‌గ‌రాన్ని త‌న‌కంటే ఎక్కువ‌గా ప్రేమించిన మ‌హోన్న‌త మాన‌వుడిగా ఖులీ కుతుబ్ షా నిలిచి పోతారు. 


ఎక్క‌డ కాలు మోపినా క‌నీసం జేబులు నిండాల్సిందే. ఖాళీ 50 రూపాయ‌లు వుంటే చాలు రోజంతా బ‌తికేయొచ్చు..అదే ఈ న‌గ‌రం ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన అద్భుత‌మైన కానుక‌. బ‌హు భాషా కోవిదుడిగా ఎంతో ప‌రిణ‌తి చెందిన కుతుబ్ షా..ఉన్న‌ట్టుండి గిరిజ‌న అమ్మాయి భాగ్ మ‌తి ని చూసి చ‌లించి పోయాడు. ఆమె లేకుండా ఉండ‌లేనంటూ త‌ల్ల‌డిల్లి పోయాడు. బంధ‌నాలు తెంచుకుని..హృద‌య క‌వాటాల‌ను తెరుచుకుని ..త‌న కోసం త‌నువును అర్పించాడు ఈ ప్ర‌భువు. త‌న కాలంలో సాహిత్యాన్ని పెంచి పోషించాడు. క‌వుల‌ను స‌మాద‌రించాడు. 


ఏకంగా త‌ను ప్రేమించిన భార్య కోసం ఏకంగా త‌న‌ను తాను అర్పించుకున్నాడు ..ఈ పాల‌కుడు. ప్రేమంటే ఏమిటంటే అంటూ రాసే క‌వులు..ఈ హైద‌రాబాద్ న‌గ‌రానికి వున్న చారిత్రిక క‌థ‌ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. సినిమాల్లో చూపించే అడ్డ‌మైన బూతును చూసి అదే ప్రేమ‌గా భావించే ద‌ద్ద‌మ్మ‌ల‌కు..నేటి యువ‌తీ యువ‌కుల‌కు ఈ ప్రాంత‌పు మ‌ట్టి చ‌రిత్రను పాఠంగా బోధించాలి. వ‌జ్రాలు, వైఢూర్యాలు, గాజులకు పెట్టింది పేరు ఈ అద్భుత న‌గ‌రం. 


బిర్యానీ, ఇరానీ ఛాయ్‌, ప‌ది రూపాయ‌ల‌కే ప‌ది స‌మోసాలు..ఓహ్ ..పేవ్ మెంట్ల మీద ప‌డుకున్నా నిమిషాల్లోపే నిద్ర‌పోయే సుంద‌ర ..సుమ‌ధుర న‌గ‌రం ఇది. ప్రేమికురాలిని స్మ‌రిస్తూ నిర్మించిన న‌గ‌ర‌మే భాగ్య‌న‌గ‌రం..నేటి హైద‌రాబాద్. హైద‌ర్ మ‌హ‌ల్ ..ఇపుడు ప్రేమ‌కు చిహ్నంగా నిలుస్తోంది. సూర్య చంద్రులున్నంత వ‌ర‌కు ఈ న‌గ‌రం వెలుగుతూనే ఉండాలి..ప్రేమ ప‌రిఢ‌విల్లుతూనే సాగాలి. ప్రేమ‌కు మ‌ర‌ణం లేదు. ప్రేమ‌కు ప్రారంభ‌మే త‌ప్ప అంతం లేదు. భాగ్‌మ‌తి బతికే ఉంది..ఖులీ కుతుబ్ షా ..ఇంకా జ్ఞాప‌కాల కాల‌పు ప్ర‌వాహంలో త‌చ్చ‌ట్లాడుతూనే ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: