లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో టీఆర్ఎస్ పార్టీకి ఊహించ‌ని ఝ‌ల‌క్‌లు ఎదుర‌వుతున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్ ఎంపీ క‌విత‌కు ప్ర‌త్య‌ర్థుల నుంచి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతోంది. నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఆరంభ ట్రెండ్స్‌లో బీజేపీ లీడ్‌లో కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు వచ్చిన ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ లీడ్ లో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కవిత వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ మూడోస్థానంలో కొనసాగుతున్నారు.


మ‌రోవైపు తెలంగాణ నుంచి కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ లీడ్ ఉన్నారు. కరీంనగర్ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలోని 7 హాళ్లలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ప్రతి హాల్ లో 14 టేబుల్స్ ఏర్పాటు.చేశారు. మొత్తం 28 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు  కాంగ్రెస్ త‌ర‌ఫున‌ పొన్నం ప్రభాకర్, బీజేపీ త‌ర‌ఫున  బండి సంజయ్ కుమార్, టీఆర్ఎస్ త‌ర‌ఫున బి.వినోద్ కుమార్ బ‌రిలో ఉన్నారు.  


ఇదిలాఉండ‌గా, పార్టీ నేత‌ల‌కు టీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ కీల‌క సూచ‌న‌లు చేశారు. కౌంటింగ్‌ ఏజెంట్లు అందరూ అప్రమత్తంగా ఉండేలా చూడాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ మేరకు పార్టీ లోక్‌ సభ అభ్యర్థులు, మంత్రులు, ముఖ్య నాయకులతో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. కౌంటింగ్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, గెలుస్తున్నామనే ధీమాలో లెక్కింపుపై నిర్లక్ష్యం పనికిరాదని చెప్పారు. చివరి రౌండ్‌ తో పాటు వీవీప్యాట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు ఏజెంట్లు అక్కడే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీవీప్యాట్ల లెక్కింపులో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్‌ అభ్యర్థులు గెలువనున్నారని ఇప్పటికే జాతీయస్థాయి సర్వేలు కూడా చెప్పాయన్న విషయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రస్తావించారు. టీఆర్ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బుధవారం అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఓట్ల లెక్కింపుపై వారికి పలు సూచనలు చేశారు. అభ్యర్థులు, మంత్రులతో మాట్లాడారు. టీఆర్ఎస్‌ అభ్యర్థులు అయితేనే తెలంగాణవాణిని లోక్‌ సభలో బలంగా వినిపించగలుగుతారని ప్రజలు విశ్వసించారని, అందుకే టీఆర్ఎస్‌ అభ్యర్థులకు ఏకపక్షంగా ఓట్లు వేశారన్నారు. జాతీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ ఎన్నిరకాల తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్ఎస్‌ను కోరుకున్నారని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: