జగన్ పార్టీ సాధిస్తున్న విజయం నిజంగా సరికొత్త చరిత్ర అని చెప్పాలి. ప్రజలు ఈ రేంజ్ లో వైసీపీకి విజయాన్ని కట్టబెడతారని వైసీపీ నాయకులూ కూడా ఊహించలేదు. ఏపీ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే సరికొత్త చరిత్రను లిఖిస్తూ దూసుకొస్తున్నారు జగన్. కనీవినీ ఎరుగని ఫలితాలు ఇవి. అప్పుడెప్పుడో ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్తలో ఇంత ప్రభంజనం చూశాం. మళ్లీ ఇప్పుడే ఆ ట్రెండ్ కనిపిస్తోంది.


నెల్లూరుజిల్లా ఓటర్లు టీడీపీని బంగాళాఖాతంలో కలిపేశారు. 10 నియోజకవర్గాల్లో పదింట వైసీపీ ఆధిక్యంలో ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి ఇక్కడ కేవలం మూడుచోట్ల విజయం దక్కింది, మరోచోట వైసీపీ ఎమ్మెల్యేని తనవైపు తిప్పుకున్న ముఖ్యమంత్రి 2019లో పదికి పది గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. తీరా ఓటర్లు ఆయనకు గుండు సున్నా చుట్టారు. జిల్లాకు ఇద్దరు మంత్రులను ఇచ్చి, మరొకరికి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి ఏదో మేలు చేశామనే భ్రమలో ప్రజల్ని ఉంచాలని చూశారు బాబు.


కానీ ఇక్కడ చంద్రబాబు ఎత్తుగడలు ఫలించలేదు. సాక్షాత్తూ ఇద్దరు మంత్రులు ఇక్కడ ఘోర పరాభవం దిశగా దూసుకుపోతున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి మంత్రి నారాయణ, సర్వేపల్లి నుంచి మంత్రి సోమిరెడ్డి పూర్తిగా వెనకపడిపోయారు. మొత్తమ్మీద జిల్లాలో టీడీపీ ఉనికిలేకుండా కర్రుకాల్చి వాతపెట్టారు ఓటర్లు, పార్టీకి నామరూపాల్లేకుండా తీర్పునిచ్చారు. ఒక్క నెల్లూరులోనే కాదు, విజయనగరం, కడప జిల్లాల్లో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తోంది. పశ్చిమ, శ్రీకాకుళం జిల్లాల్లో పూర్తి ఆధిపత్యం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: