జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఘోర పరాభవం చెందారు. ఈ ఎన్నిక‌ల్లో పార్టీ పెట్టిన ప‌వ‌న్ ఏకంగా రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేశారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్ పోటీ చేశారు. గాజువాకలో పవన్‌పై వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి గెలుపొందారు. భీమవరంలో పవన్‌పై  వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ విజ‌యం సాధించారు. మొత్తంగా ప‌వ‌న్ పోటీ చేసిన రెండు చోట్లా కూడా ఓడిపోవ‌డంతో జ‌న‌సేన శ్రేణులు తీవ్ర‌మైన నైరాశ్యంలో కూరుకుపోయాయి.


ఈ ద‌ఫా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ద‌క్షిణారాష్ట్రాల్లోని రాజ‌కీయ వ‌ర్గాలు, సినీ వ‌ర్గాలు సైతం ఎక్కువ‌గా దృష్టి పెట్టిన నియోజ‌క‌వ‌ర్గం భీమ‌వ‌ర‌మే. ఇక్క‌డ నుంచి జ‌న‌సేన త‌ర‌ఫున నేరుగా ఆ పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేయ‌డంతో అంచ‌నాలు ఊపందుకున్నాయి. రాజ‌కీయాల్లో మార్పుకోసం రంగంలోకి వ‌చ్చాన‌ని ప‌దే ప‌దే చెప్పుకొన్న ప‌వ‌న్ తాను తొలిసారి ప్ర‌జాక్షేత్రంలోకి దిగిన నియోజ‌క‌వ‌ర్గం ఇదే. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసినా.. ఎక్కువ భాగం త‌న సొంత జిల్లా ప‌శ్చిమ గోదావ‌రి నుంచి ప‌వ‌న్ పోటీ చేయ‌డంతో ఇక్క‌డ ఎక్కువ ఆస‌క్తి నెల‌కొంది. 


త‌న సినీ అభిమానులు, పార్టీ అనుచరుల ప్రోత్సాహంతో ఇక్క‌డ గెలుపు ఖాయ‌మ‌ని ముందుగానే నిర్ణ‌యించుకున్నారు ప‌వ‌న్‌. ఇక‌, ఇక్క‌డ నుంచి టీడీపీ, వైసీపీలు కూడా బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌నే రంగంలోకి దింపాయి. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులు ఉర‌ఫ్ అంజిబాబు, వైసీపీ త‌ర‌ఫున గ్రంధి శ్రీనివాస్ బ‌లంగానే ప్ర‌చారం చేశారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ప‌సుపు-కుంకుమ త‌న‌ను గ‌ట్టెక్కిస్తాయ‌ని అంజిబాబు, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌, జ‌గ‌న్ మ్యానియా త‌న‌కు క‌లిసి వ‌స్తుంద‌ని శ్రీనివాస్ ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక వైసీపీ వేవ్ నేప‌థ్యంలో ప‌వ‌న్ మేనియా చిత్తు చిత్తు అయ్యింది. ఇక ప‌వ‌న్‌ను ఓడించిన గ్రంధి శ్రీనివాస్‌కు జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వి ఖాయ‌మంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: