ఏపీలో ఈ సారి అత్యంత ఆస‌క్తి రేపిన సీట్లలో గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు సీటు ఒక‌టి. ఇక్క‌డ నుంచి వైసీపీ అభ్య‌ర్థి మేక‌తోటి సుచరితో విజ‌యం సాధించారు. ఆమె మాజీ మంత్రి డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌పై ఘ‌న‌విజ‌యం సాధించారు. ఇక్క‌డ త్రిముఖ పోటీలో ఎవ‌రు గెలుపు గుర్రం ఎక్కార‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. అయితే, మెజారిటీ కూడా స్వ‌ల్పంగానే ఉంటుంద‌నే అంచ‌నాలు కూడా నిజ‌మ‌య్యాయి. వైసీపీ నుంచి గెలిచిన సుచ‌రిత‌కు 91 వేల ఓట్లు వ‌స్తే.. డొక్కాకు 84 వేల ఓట్లు వ‌చ్చాయి. ఇక జ‌న‌సేన నుంచి పోటీ చేసిన మ‌రో మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబుకు కేవ‌లం 26 వేల ఓట్లు వ‌చ్చాయి.


వాస్త‌వానికి ప్ర‌త్తిపాడు నియోజక‌వ‌ర్గంపై ఆది నుంచి కూడా అంచ‌నాలు భిన్నంగానే ఉన్నాయి. మాజీ మంత్రులు ఇద్ద‌రు, ఒక మాజీ ఎమ్మెల్యే త‌ల‌ప‌డ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆస‌క్తిని రేపిన నియోజ‌క‌వ‌ర్గంగా ఇది గుర్తింపు పొందింది. కాంగ్రెస్ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌, ఇక‌, 2014లోనే తొలిసారి రాజ‌కీయ అరంగేట్రం చేసి, టీడీపీ టికెట్‌పై ఇక్క‌డ విజ‌యం సాధించి ఆ వెంట‌నే మంత్రి ప‌ద‌విని కైవ‌సం చేసుకుని, అనూహ్య రీతిలో జ‌న‌సేన‌లోకి వ‌చ్చిన రావెల కిశోర్ బాబులు త‌ల‌ప‌డ్డారు. 


ఇక‌, వైఎస్ ఫ్యామిలీకి అనుంగు అనుచ‌రురాలిగా, అత్యంత విశ్వాస పాత్రురాలిగా గుర్తింపు తెచ్చుకున్న మేక‌తోటి సుచ‌రిత కూడా భారీ ఎత్తున పోటీ ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం, ఇప్పుడు జ‌గ‌న్ మ్యానియా వంటివి ఆమెకు బాగానే ప‌నిచేశాయ‌ని అనుకున్నారు. ఇక‌, మాజీ మంత్రులు ఇద్ద‌రూ కూడా ఇక్క‌డ హోరా హోరీ పోటీ చేశారు. జ‌న‌సేన నుంచి రావెల‌, టీడీపీ నుంచి డొక్కాలు గెలుపు గుర్రం ఎక్కేందుకు తీవ్రంగా క‌ష్టించారు. ఇక‌, తాజా ఫ‌లితంతో ప్ర‌జ‌లు సుచ‌రిత‌ వైపు ఉన్నార‌నే విష‌యం స్ప‌ష్టం కావ‌డంతో మిగిలిన రెండు శిబిరాల్లోనూ నిర్వేదం అలుముకుంది. ఇక వైసీపీ నుంచి పోటీ చేసి ఏకంగా ఇద్ద‌రు మాజీ మంత్రుల‌ను ఓడించిన సుచ‌రిత జెయింట్ కిల్ల‌ర్‌గా నిలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: