ఏపీలో అత్యంత ఆస‌క్తిరేపిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టిగా నిలిచిన గుడివాడ‌లో వైసీపీ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని వ‌రుస‌గా నాలుగో సారి విజ‌యం సాధించారు. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం కొడాలి నాని అవినాష్‌పై 16,640 ఓట్ల ఆధిక్యంతో నాని ఘ‌న‌విజ‌యం సాధించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో గుడివాడ‌లో పెద్ద యుద్ధ‌మే జ‌రిగింది. ఆయ‌న స్థానికుడు కాదు. ఓ పిల్ల‌కాకి. నాపైన గెల‌వ‌డం అంత త‌మాషా కాదు!- అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్య‌ర్థి, పార్టీ ఫైర్ బ్రాండ్ కొడాలి శ్రీవెంక‌టేశ్వ‌ర‌రావు ఉర‌ఫ్ నాని వ్యాఖ్య‌లు ఒక‌ప‌క్క‌, గెలిచింది గుడివాడ‌లో ఉండేది హైద‌రాబా ద్‌లో.. ఆయ‌న‌ను న‌మ్ముకుంటే.. కుక్క‌తోక ప‌ట్టుకుని గోదావ‌రి ఈదిన‌ట్టే- అంటూ టీడీపీ అభ్య‌ర్థి, తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసిన యువ నాయ‌కుడు దేవినేని అవినాష్ వ్యాఖ్య‌లు మ‌రోప‌క్క ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఏప్రిల్ మాసంలోనే ఠారె త్తించాయి. 


ఇరువురూ ఒకే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం, మాట‌ల తూటాల్లో ఎవ‌రూ త‌క్కువ కాక‌పోవ‌డం వంటి నేప‌థ్యంలో ఎవ‌రు గెలుస్తారు అనేది సంచ‌ల‌నంగా మారింది. ఇక‌, ఎప్ప‌టిక‌ప్పుడు టీడీపీపైనా, చంద్ర‌బాబు పైనా విరుచుకుప‌డే కొడాలిని ఎట్టిప‌రిస్థితిలోనూ ఈ ఎన్నిక‌ల్లో మ‌ట్టి క‌రిపించాల‌ని చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వేసిన అడుగుల నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌కు చెందిన అవినాష్‌ను ఇక్క‌డ నుంచి రంగంలోకి దింపారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న కుటుంబం నుంచి రావ‌డం, ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో ఇరు ప‌క్షాలు కూడా హోరా హోరీ త‌ల‌ప‌డ్డాయి. 


నువ్వా-నేనా అనే రీతిలో సాగిన పోరుపైరాష్ట్ర‌వ్యాప్తంగా బెట్టింగుల ప‌ర్వం కూడా భారీగానే న‌డిచింది. నాని గెలుస్తాడ‌ని అయితే, మెజారిటీ త‌గ్గుతుంద‌ని కొంద‌రు, కాదు, అవినాష్ గెలుస్తాడ‌ని, మెజారిటీ కూడా భారీగానే ఉంటుంద‌నికొంద‌రు బెట్టింగులు క‌ట్టారు. తాజా ఫ‌లితాల‌తో గెలిచిన వైసీపీ వారు ఆనందిస్తుండ‌గా.. ఓడిన టీడీపీ వారు షాక్‌లో ఉన్నారు. ఇక ఓవ‌రాల్‌గా నానికి 69,973 ఓట్లు వ‌స్తే.. టీడీపీ నుంచి పోటీ చేసిన అవినాష్‌కు 53,213 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇప్ప‌టికే మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన నాని..ఈ గెలుపుతో నాలుగో గెలుపు త‌న ఖాతాలో వేసుకున్నారు. నానికి జ‌గ‌న్ కేబినెట్లో మంత్రి ప‌ద‌వి ఖాయ అయ్యింది.



మరింత సమాచారం తెలుసుకోండి: