ఏపీ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఫ్యామిలీని మ‌రోసారి తుని ప్ర‌జ‌లు ఓడించారు. వైసీపీ అభ్య‌ర్థి దాడిశెట్టి రాజా య‌న‌మ‌ల కృష్ణుడుపై 24 వేల ఓట్ల తేడాతో గెలిచారు. తుని నియోజ‌క‌వ‌ర్గం ఒక‌ప్పుడు కంచుకోట‌. 1983 నుంచి 2004 వ‌ర‌కు వ‌రుస‌గా ఆరుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో య‌న‌మ‌ల 2009లో ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన య‌న‌మ‌ల త‌మ్ముడు కృష్ణుడు తాజా ఎన్నిక‌ల్లో మ‌రోసారి వైసీపీ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. తునిలో ఈ ఇద్ద‌రి మ‌ధ్యే హోరా హోరీ పోరు సాగింది. 2014లో రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఇరు పార్టీల‌కూ ఆశ‌లు భాగానే ఉన్నాయి. ఈ క్ర‌మంలో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన య‌న‌మ‌ల కృష్ణుడు, వైసీపీ అభ్య‌ర్థిగా దాడిశెట్టి రాజాలు కూడా పోటా పోటీ ప్ర‌చారం నిర్వ‌హించారు.

త‌మ‌కు పెట్ట‌ని కోట‌గా ఉన్న తునిలో గెలిచి తీరుతామ‌నే క‌సితో కృష్ణుడు, ఎట్టిప‌రిస్థితిలోనూ స‌త్తా చాటాల‌ని రాజాలు ఇద్ద‌రూ కూడా గ‌ట్టిగానే రంగంలో త‌ల‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో ప్ర‌చారాన్ని నువ్వా-నేనా అన్న‌ట్టు త‌ల‌ప‌డ్డారు. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా గెలుపు కోసం ఇద్ద‌రూ పోటీ ప‌డ్డారు. ఆర్థికంగా కూడా ఇద్ద‌రూ బ‌లంగానే ఉండ‌డంతో డ‌బ్బు పంపిణీలోనూ ఇద్ద‌రూ పోటీ ప‌డ్డారు. అయితే గ‌త‌ ఎన్నిక‌ల్లో 18 వేల పైచిలుకు ఓట్ల తేడాతో రాజా విజ‌యం సాధించారు. దీంతో కృష్ణుడు ఓట‌మి పాల‌య్యారు. ఇక‌, ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక ల్లోనూ టీడీపీ, వైసీపీలు ఈ ఇద్ద‌రికే ఛాన్స్ ఇచ్చాయి. ఇప్పుడు ఇక్క‌డ మూడో పార్టీ జ‌న‌సేన నుంచి అశోక్ త‌ల‌ప‌డ్డారు. 


మొత్తంగా త్రిముఖ పోరు జ‌రుగుతుంద‌ని భావించినా.. టీడీపీ, వైసీపీ మ‌ధ్యే పోరు సాగ‌డం గ‌మ‌నార్హం. నువ్వా నేనా అన్న‌ట్టు సాగిన ఈ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు అంద‌రినీ ఉత్కంఠ‌కు గురిచేశాయి. తాజా ఫ‌లితాల వెల్ల‌డితో మ‌రోసారి తునిలో య‌న‌మ‌ల ఫ్యామిలీ ఇంటికే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. దాడిశెట్టి రాజాకు 80 వేల ఓట్లు రాగా... య‌న‌మ‌ల కృష్ణుడుకు కేవ‌లం 56 వేల ఓట్లు వ‌చ్చాయి. ఇక జ‌న‌సేన ఇక్క‌డ గ‌ట్టి ప్ర‌భావం చూపుతుంద‌ని అనుకున్నా కేవ‌లం 6 వేల ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: