నడక ఆరోగ్యానికి మంచిదని వైద్యనిపుణులు ఎప్పుడూ చెప్తున్న విషయమే. నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పలు అధ్యయనాల్లో కూడా తేలింది. అయితే నడక ఆరోగ్యానికే కాదు అధికారానికి కూడా రాచబాటలు వేస్తుందని మరోమారు నిరూపితమైంది. తాజాగా వెలువ‌డిన ఫ‌లితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుమ్ముదులిపే విజ‌యం ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, తాజా మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సైతం ఇదే ట్రెండ్ కొన‌సాగించారు. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2004లో కాంగ్రెస్‌ పార్టీని భారీ మెజార్టీతో అధికారంలోకి తీసుకొచ్చారు. 2009లో సైతం మళ్లీ కాంగ్రెసే గెలిచింది. 2009లో పాదయాత్ర గురించి పట్టించుకోని చంద్రబాబునాయుడు ఇక తప్పదనకుని 2013లో పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ విభజన కూడా జరిగిపోయింది.  అయితే 2014 విభజిత ఆంధ్రప్రదేశ్‌ (నవ్యాంధ్ర) లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ ఐదేళ్ల‌పాటు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది.


2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్‌ జగన్‌ మళ్లీ పాదయాత్రనే నమ్ముకున్నారు. తన తండ్రి కంటే ఎక్కువగా 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్‌ చరిత్ర సృష్టించారు. ప్రస్తుత అసెంబ్లీ ఫలితాల్లో ఘన విజయం సాధించారు. దీంతో పాదయాత్ర ద్వారా జనం కష్టాలను తెలుసుకున్న వారికే విజయం ఖాయమని మరోమారు నిరూపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: