ప‌శ్చిమ‌గోదావ‌రి జ‌ల్లా ఆచంట నుంచి పోటీ చేసిన మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ ఈ ఎన్నిక‌ల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస విజ‌యాల‌తో గెలిచిన పితానికి ఈ ఎన్నిక‌ల్లో షాక్ త‌ప్ప‌లేదు. పితానిపై వైసీపీ అభ్య‌ర్థి చెరుకువాడ శ్రీరంగ‌నాథ రాజు ఘ‌న‌విజ‌యం సాధించారు. పితానిపై రంగ‌నాథ‌రాజు 10 వేల ఓట్ల ఆధిక్యంతో విజ‌యం సాధించారు. మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు సాధించ‌డం, ఇప్పుడు కూడా పోటీకి దిగి, గెలుపు గుర్రం ఎక్కేందుకు తీవ్ర‌స్థాయిలో పోరు చేయ‌డంతో ఆచంట నియోజ‌క‌వ‌ర్గం తెర‌మీదికి వ‌చ్చింది. 


గ‌త ఎన్నిక‌ల‌కు కొద్ది వారాల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్న పితాని.. ఆ పార్టీ టికెట్‌ను సాధించి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. మెజారిటీ స్వ‌ల్పంగానే వ‌చ్చినా.. చంద్ర‌బాబు ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ఇక‌, ఈ ఎన్నిక‌ల్లోనూ విజ‌య‌మే ల‌క్ష్యంగా పితాని దూకుడు ప్ర‌ద‌ర్శించారు. త‌న వ‌ర్గాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారు. పితాని ప్ర‌తిసారి క్యాస్ట్ ఈక్వేష‌న్ల‌ను న‌మ్ముకుని రాజ‌కీయాలు చేసుకుంటూ రాగా ఈ సారి ఆయ‌న క్యాస్ట్ ఈక్వేష‌న్లు మిస్ అయ్యాయి.


ఇక‌, ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున బ‌రిలోనిలిచిన మాజీ ఎమ్మెల్యే, రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ఆర్థికంగా బ‌లంగా ఉన్న చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు పోటీకి చేశారు. ఆది నుంచి కూడా ఈయ‌న బ‌లంగా పోటీ ఇచ్చారు. టికెట్ క‌న్ఫ‌ర్మ్ కాక‌ముందు నుంచే నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. బల‌మైన మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ ఆయ‌న‌కు అండ‌గా నిలిచింది. దీంతో పోటీ నువ్వా నేనా అనేరేంజ్‌లో సాగింది. త్రిముఖ పోటీ నెల‌కొన్నా.. గెలుపు మాత్రం ఈ ఇద్ద‌రి మ‌ధ్యే దోబూచులాడింది. ఇక‌, తాజా ఫ‌లితాల‌తో ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. మొత్తానికి రంగ‌నాథ‌రాజు విజ‌యంతో న‌ల‌భై రోజుల స‌స్పెన్స్ వీడిపోయింది. 


నియోజ‌క‌వ‌ర్గంలో శెట్టిబ‌లిజ‌ల ఓట్లు అధికంగా ఉండ‌డంతో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ అవే ఓట్లు పితానిని గెలిపించాయి. ఈ సారి ఆ వ‌ర్గం ఓట్ల‌లో చీలిక రావ‌డంతో పాటు ఇటు ఎస్సీ, ఎస్టీ సామాజిక‌వ‌ర్గాలు కూడా పితానిని ఓడించాల‌ని క‌సితో రంగ‌నాథ‌రాజుకు ఓట్లు వేశాయి. దీనికి తోడు వైసీపీ వేవ్ కూడా పితాని ఓట‌మికి కార‌ణ‌మైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: