ఏపీలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట ఒక‌టి. మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావును ఓడించేందుకు జ‌గ‌న్ ఇక్క‌డ అభ్య‌ర్థి ఎంపిక‌లో పెద్ద సాహ‌సం చేయ‌గా... ఆ సాహ‌సం ఇప్పుడు ఫ‌లించింది. పుల్లారావుపై వైసీపీ అభ్య‌ర్థి విడ‌ద‌ల ర‌జ‌నీ 8 వేల ఓట్ల ఆధిక్యంతో విజ‌యం సాధించారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నారై మ‌హిళ‌, బీసీ వ‌ర్గానికి చెందిన విడ‌ద‌ల ర‌జ‌నీకి అవ‌కాశం ఇవ్వ‌డం ఆది నుంచి కూడా ఆస‌క్తిగా మారింది. 


ఆమె వ‌చ్చీ రావ‌డంతోనే విస్తృతంగా డ‌బ్బులు ఖ‌ర్చు చేశారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. ప్ర‌తి నాయ‌కుడినీ క‌లుసుకున్నారు. గెలుపు మంత్రం ప‌ఠించారు. ముఖ్యంగా వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ పోటీ చేయాల‌ని భావించిన మ‌ర్రిరాజ‌శేఖ‌ర్‌కు టికెట్ ల‌భించ‌క‌పోవ‌డం ఒక‌ప‌క్క జ‌గ‌న్ ఆయ‌న‌ను బుజ్జ‌గించినా.. మ‌రోప‌క్క విడ‌ద‌ల కూడా బుజ్జ‌గించ‌డంతో ఇక్కడ వైసీపీ వ‌ర్గాలు ఏక‌తాటిపైకి చేరి.. గ‌ట్టిగానే ప్ర‌చారం చేశారు. ప్ర‌తి విష‌యంలోనూ పుల్లారావుతో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో ముందుకు వెళ్లారు. ఆయ‌నపై ఉన్న ఆరోప‌ణ‌ల‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు.


ఇక‌, టీడీపీ నుంచి మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుకు విజ‌యం చావో రేవో ? అనే రేంజ్‌లో సాగింది. ఆయ‌న గెలుపు ద్వారా వ‌రుస‌గా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాల‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోయారు. గ‌తంలో ఏమైనా పొర‌పాట్లు జ‌రిగి ఉంటే మ‌న్నించి పెద్ద‌మ‌న‌సు చేసుకుని గెలిపించాల‌ని విన్న‌వించారు. ఆర్థికంగా ఇద్దరు కూడాబాగానే ఖ‌ర్చు చేశారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క‌సారిగా హైప్ వ‌చ్చింది. మ‌హిళా అభ్య‌ర్థి కావ‌డం త‌న‌కు క‌లిసి వ‌స్తుంద‌ని ర‌జ‌నీ, మంత్రిని కావ‌డంతో త‌న ప‌క్షానే ప్ర‌జ‌లు ఉన్నార‌ని ప్ర‌త్తిపాటి లెక్క‌లు వేసుకున్నారు. అయితే ఫైన‌ల్‌గా ప్ర‌త్తిపాటి లెక్క‌లు త‌ప్ప‌డంతో ర‌జ‌నీ గెలుపొందారు. మంత్రికి 85 వేల ఓట్లు రాగా... ర‌జ‌నీకి 93 వేల ఓట్లు వ‌చ్చాయి. 8 వేల ఓట్ల‌తో ఎన్నారై మ‌హిళ ర‌జ‌నీ ఏకంగా మంత్రినే ఢీ కొట్టి సంచ‌ల‌నం క్రియేట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: