ఏపీలో టీడీపీ సీనియ‌ర్ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర‌కుమార్ పోటీ చేసిన గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గం అత్యంత ఆస‌క్తిరేపింది. ఇప్ప‌టికే ఐదుసార్లు గెలిచిన న‌రేంద్ర ఈ గెలుపుతో డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టాల‌ని క‌ల‌లు క‌న్నారు. అయితే ఆయ‌న క‌ల‌లు రివ‌ర్స్ అయ్యాయి. వైసీపీ అభ్య‌ర్థి కిలారు వెంక‌ట రోశ‌య్య న‌రేంద్ర‌పై వెయ్యి ఓట్ల స్వ‌ల్ప తేడాతో విజ‌యం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయ దిగ్గ‌జాలు సైతం ఊహించిన ఫ‌లిత‌మే ఇక్క‌డ వ‌చ్చింది. గ‌డిచిన ఐదు ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధిస్తూ.. వ‌చ్చిన ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ విజ‌యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. 


ఆయ‌న ఈ ద‌ఫా న‌రేంద్ర‌ గెలుస్తారా?  లేక ఇక్క‌డ నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన  ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు అల్లుడు కిలారు రోశ‌య్య గెలుపు గుర్రం ఎక్కుతారా? అనేది రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వ‌రుస‌గా ఆరోసారి కూడా గెలిచి డ‌బుల్ హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకునేందుకు ధూళిపాళ్ల ఎంతో శ్ర‌మించారు. ఇక‌, ఇక్క‌డ వైసీపీ జెండాను ఎగ‌రేసేందుకు వైసీపీ అభ్య‌ర్థిగా కిలారు రోశ‌య్య కూడా భారీగానే పోటీ ఇచ్చారు. ఇద్ద‌రూ ఆర్థికంగా బ‌లంగా ఉండడం, బ‌ల‌మైన‌ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు కావ‌డంతో పోరు హోరా హోరీగా సాగింది. 


ఇక‌, తాజా ఫ‌లితాల‌తో ఇక్క‌డ ఏర్ప‌డిన స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి ప్ర‌జ‌ల నాడి చాలా విభిన్నంగా ఉంద‌నే వ్యాఖ్య‌లు సైతం వినిపిస్తున్నాయి. మొత్తానికి 42 రోజుల స‌స్పెన్స్‌కు తెర‌దించుతూ వెలువ‌డిన ఫ‌లితం ఆస‌క్తిగా మారింది. గుంటూరు జిల్లాలో ఇప్ప‌టికే వ‌రుస‌గా ఐదుసార్లు గెలిచిన మాజీ మంత్రులు మాకినేని పెద‌ర‌త్త‌య్య‌, కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆరో ప్ర‌య‌త్నంలో ఓడిపోయారు. ఇప్పుడు అదే బ్యాడ్ సెంటిమెంట్‌కు న‌రేంద్ర కూడా బ‌ల‌య్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: