ఆయన బొబ్బిలి రాజు. మాట తప్పని మడమ తిప్పని నైజం కలిగిన వాడని జనం నమ్ముతారు. ఆయన తాత రంగారావు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు. చాలా కాలం పాటు వారి వంశం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2004 ఎన్నికల్లో తిరిగి రాజకీయ ప్రవేశం చేసిన సుజయ క్రిష్ణ రంగారావు వైఎస్సార్ చలవతో మంచి మెజారిటీతో బొబ్బిలి నుంచి గెలిచారు. ఆ తరువాత 2009లో మరో మారు జెండా ఎగరేశారు.


వైఎస్ మరణానంతరం జగన్ వైపు వచ్చిన ఆయన విజయనగరం జిల్లాలో అయిదేళ్ల పాటు చక్రం తిప్పారు. ఐతే బొత్స సత్యనారాయణ వైసీపీలోకి రావడంతో ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయారు. మంత్రి పదవి కోసం ఆశపడి ఆయన చేరారని జనం నమ్మారు. దానికి ఫలితమే ఆయన ఓటమి. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్న శంబంగి చిన అప్పలనాయుడుని ముందు పెట్టి బొత్స నడిపిన రాజకీయానికి తోడు వైఎస్ జగన్ గాలి బలంగా వీచి ఫిరాయింపు మంత్రి దారుణంగా పరాజయం పాలు అయ్యారు.


సామన్య రైతుగా జీవితం గడిపే అప్పలనాయుడే రాజుల కంటే ఉత్తమం అనుకుని జనం ఓటేసారు. పైగా మాట మీద నిలబడకుండా పార్టీ ఫిరాయించినందుకు తగిన పరిహారం ఇదేనని ఓటు ద్వారా చాటి చెప్పారు. దాంతో మూడు సార్లు ఎదురులేకుండా గెలిచిన బొబ్బిలి రాజులకు వారి సొంత చోటే ఘోర పరాజయం మూటకట్టుకోవాల్సివచ్చింది.
 



మరింత సమాచారం తెలుసుకోండి: