తూర్పుగోదావ‌రి జిల్లా కేంద్ర‌మైన కాకినాడ సిటీ సీటు నుంచి వైసీపీ అభ్య‌ర్థి ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి విజ‌యం సాధించారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌న‌మాడి వెంక‌టేశ్వ‌ర‌రావు (కొండ‌బాబు)పై వైసీపీ నుంచి పోటీ చేసిన ద్వారంపూడి చంద్రశేఖ‌ర్‌రెడ్డి విజ‌యం సాధించారు. కొండ‌బాబుకు 59 వేల ఓట్లు రాగా... చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డికి 73 వేల ఓట్లు వ‌చ్చాయి. తూర్పుగోదావ‌రి జిల్లాలో అత్యంత ఉత్కంఠ‌కు గురిచేసిన ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో కాకినాడ సిటీ ఒక‌టి.
ప్ర‌ధానం గా రెండు పార్టీల మ‌ధ్య గెలుపు వ్యూహ‌మే ల‌క్ష్యంగా సాగిన ఎన్నికల పోరులో నువ్వా నేనా అనే విధంగా ఇక్క‌డ అభ్య‌ర్థులు కూడా త‌ల‌ప‌డ్డారు. 


కాకినాడ సిటీ నియోజ‌క‌వ‌ర్గం లోనూ ఇదే విధంగా ఎన్నిక‌ల పోరుసాగింది. గ‌త ఎన్నిక‌ల్లో ఊహించ‌ని విధంగా విజ‌యం సాధించారు టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన వ‌న‌మాడి వెంక‌టేశ్వ‌ర‌రావు ఉర‌ఫ్ కొండ‌బాబు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా ద్వారం పూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డే పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నిక‌ల్లో ద్వారంపూడి సైతం ఊహించ‌ని విధంగా దాదాపు 24 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో వ‌న‌మాడి విజ‌యం సాధించారు. అంత‌కుముందు 2009లో ద్వారంపూడి విజ‌యం సాధించారు. 


ఇక‌, తాజా ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ.. ఇక్క‌డ త‌న‌కు మిత్రుడు, సాక్షిమీడియా గ్రూప్ మెంబ‌ర్ అయిన ద్వారంపూడిని గెలిపించి తీరాల‌ని జ‌గ‌న్ కంక‌ణం క‌ట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో తానే స్వ‌యంగా ప్ర‌చారం కూడా చేశారు. ఇక‌, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు స‌హా ప‌సుపు-కుంకుమ త‌న‌ను గెలిపించి తీరుతాయ‌ని వ‌న‌మాడి గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ జ‌రిగిన ప్ర‌చారం ఇరు ప‌క్షాల‌ను హోరెత్తించింది. అదేస‌మ‌యంలో ముచ్చ‌ట‌గా మూడో పార్టీ జ‌న‌సేన నుంచి కూడా ఇక్క‌డ పోటీ ఎక్కువ‌గానే జ‌రిగింది. ముత్తా శ‌శిధ‌ర్ గ‌ట్టిపోటీ ఇచ్చారు. మొత్తానికి అంద‌రి ఉత్కంఠ‌కూ తెర‌దించుతూ.. నేడు వెలువ‌డిన తీర్పుతో కాకినాడ సిటీలో వైసీపీ జెండా ఎగిరింది.



మరింత సమాచారం తెలుసుకోండి: