ప్ర‌పంచ‌క‌ప్ వ‌న్డే క్రికెట్ ఫైన‌ల్ మ్యాచ్‌ను త‌ల‌పించిన విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు చివరి వ‌ర‌కు దోబూచులాడుతూ చివ‌ర‌కు వైసీపీ అభ్య‌ర్థి మ‌ల్లాది విష్ణుకు చిక్కింది. కేవ‌లం 15 ఓట్ల‌తోనే మ‌ల్లాది రెండోసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. తాజా ఎన్నిక‌ల్లో లేస్తే.. నా అంతవాడు లేడ‌నే వారు ఒక‌వైపు, ఎల్లవేళ‌లా నేను ప్ర‌జ‌ల ప‌క్ష‌మే అనే నాయ‌కుడు మ‌రోవైపు, ఇక‌, నా అంత మంచి మ‌నిషి, నాయ‌కుడు కూడా లేడ‌నే వారు ఇంకొక‌రు. ఇలా మూడు పార్టీల త‌ర‌ఫున ముచ్చ‌ట‌గా జ‌రిగిన ఎన్నిక‌ల పోరులో తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు వైసీపీ అభ్య‌ర్థికి గెలుపును క‌ట్ట‌బెట్టాయి. 


ఈ ఎన్నిక‌ల్లో సెంట్ర‌ల్ ఓట‌ర్లు ఆచితూచి వ్య‌వ‌హ‌రించారు. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప‌ట్టుకొమ్మ‌గా ఉన్న విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో ఒకింత బ్రాహ్మ‌ణ వ‌ర్గం ఓట్లు కీల‌కం. ఈ వ‌ర్గానికే వైసీపీ అధినేత జ‌గ‌న్ టికెట్ ఇచ్చారు. అయితే, టీడీపీ గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన పార్టీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావుకే మ‌ళ్లీ టికెట్ ఇచ్చింది. ఈ ద‌ఫా గెలిచి .. మంత్రి వ‌ర్గంలో సీటు సంపాయించాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగారు బొండా. అయితే, వైఎస్ అనుచ‌రుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన మ‌ల్లాది విష్ణు.. తాజా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌నే ల‌క్ష్యంతో ముందుకు వెళ్లారు. 


ఇక‌, జ‌న‌సేన, క‌మ్యూనిస్టుల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా రంగంలోకి దిగారు శ్రామిక ప‌క్ష‌పాతి.. చిగురుపాటి బాబూరావు.. ముగ్గురూ మూడు సామాజిక వ‌ర్గాల‌కుచెందిన వారు కావ‌డంతో పోరు కూడా అదే రేంజ్‌లో పోటీ చేశారు. హోరా హోరీగా సాగిన పోరులో ఎవ‌రు గెలుస్తార‌నే అంశంపై నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలోనే కాకుండా విజ‌య‌వాడ న‌గ‌ర ప‌రిధిలోనూ చ‌ర్చ జ‌రిగింది. మొత్తానికి ఈ ఫ‌లితం ప్ర‌జ‌ల నిర్ణ‌యానికి అద్దం ప‌ట్టింది. అత్యంత ఉత్కంఠ భ‌రితంగా సాగిన కౌంటింగ్‌లో తొలి రౌండ్ నుంచి చివ‌రి వ‌ర‌కు మ‌ల్లాది విష్ణు ఆధిక్యంలో ఉన్నారు. చివ‌రి రెండు రౌండ్ల‌లో బొండా దూసుకువ‌చ్చినా కేవ‌లం 15 ఓట్ల‌తో మ‌ల్లాదినే విజ‌యం వ‌రించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: