ఉత్కంఠ‌ను రేకెత్తించిన ఏపీ ఎన్నిక‌లు ఫ‌లితాల విష‌యంలోనూ కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అదే దోర‌ణిలో సాగాయి. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థిగా వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ రికార్డు సాధించారు. జగన్‌కు 85,179 ఓట్ల మెజార్టీ వచ్చింది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జగన్‌కు 1,23,362 ఓట్లు రాగా ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సింగారెడ్డి వెంకట సతీష్‌రెడ్డికి 38,183 ఓట్లు వచ్చాయి. వైసీపీ నుంచి పర్చూరు అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్టీరామారావు పెద్దఅల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు స‌మీప  టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుపై కేవలం 8  ఓట్ల మెజార్టీతో గెలిచారు. దగ్గుబాటికి 27,047 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థికి 27,039 ఓట్లు వచ్చాయి. టీడీపీ అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో కేవలం 29,993 ఓట్ల మెజార్టీతో గెలిచారు. చంద్రబాబుకు 98,833 ఓట్లు రాగా, ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కే చంద్రమౌళికి 68,840 ఓట్లు వచ్చాయి. 
ఆరు నియోజకవర్గాలలో గెలిచిన అభ్యర్థులు కేవలం వందల ఓట్ల తేడాతోనే గెలవడం గమనార్హం.  కొండపి నియోజకవర్గంలో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి  జీబీవీ స్వామి కేవలం 168  ఓట్ల మెజార్టీతో గెలిచారు. కర్నూలు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ భరత్‌ కేవలం 643 ఓట్ల మెజార్టీ సాధించారు.  కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్‌రెడ్డికి టీడీపీ అభ్యర్థిపై 592 ఓట్ల మెజార్టీ వచ్చింది. తిరుపతి నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డి సమీప టీడీపీ అభ్యర్థిపై 281 ఓట్ల మెజార్టీ సాధించగా,  విజయవాడ సెంట్రల్‌లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు వైసీపీ అభ్యర్థిపై కేవలం 606 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇచ్చాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన పిరియ సాయిరాజ్‌ టీడీపీ అభ్యర్థిపై 235 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: