ఈశాన్య భార‌తంలోని కీల‌క రాష్ట్రాల్లో ఒక‌టైన అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులేస్తోంది. 60 స్థానాలు గల అసెంబ్లీలో 14 స్థానాల్లో విజయం సాధించింది. వీరిలో ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గ‌త నెల 11న తొలిదశ ఎన్నికల్లో భాగంగా అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి, రాష్ట్రంలోని రెండు పార్లమెంట్‌ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. గురువారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తొలిసారి పోటీ చేసిన జేడీయూ మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందగా, ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. జేడీఎస్‌, మేఘాలయ సీఎం కన్రడ్‌ సంగ్మా సారథ్యంలోని నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్పీపీ) ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నది. కాగా, కాంగ్రెస్‌ పార్టీ కేవలం రెండు స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తున్నది.


అయితే అసెంబ్లీ స్పీకర్‌ టెంజింగ్‌ నొర్బూ థోంగ్‌డాక్‌, హోంమంత్రి కుమార్‌ వాయి ఓటమి పాలవ్వడం బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ అని భావిస్తున్నారు. వీరిద్దరూ కొత్త అభ్యర్థుల చేతుల్లోనే ఓటమి పాలవ్వడం ఆసక్తికర పరిణామం. ఈ ఎన్నికల్లో బీజేపీ 57 స్థానాల్లో, కాంగ్రెస్‌ 46, ఎన్పీపీ 30, జేడీయూ 15, జేడీఎస్‌ 12, పీపీఏ తొమ్మిది స్థానాల్లో పోటీ చేశాయి. రాష్ట్రంలోని 57 అసెంబ్లీ స్థానాలకు, రెండు లోక్‌సభ స్థానాలకు తొలిదశ పోలింగ్‌లో 66 శాతం పోలింగ్‌ నమోదైంది. 2014 ఎన్నికల్లో 44 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నబం తుకీ క్యాబినెట్‌లో పెమాఖండూ మంత్రిగా పని చేశారు. 2016లో 33 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పెమాఖండు సారథ్యంలో తొలుత పీపీఏలో చేరారు. 2016 జూలైలో పెమాఖండు సీఎంగా ప్రమాణం చేశారు. తర్వాత పీపీఏను పెమాఖండు బీజేపీలో విలీనం చేశారు. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీ కేవలం 11 స్థానాల్లో గెలుపొందింది. 


మ‌రోవైపు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలోని రెండు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. అరుణాచల్‌ వెస్ట్‌ స్థానంలో కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి నబంతుకీపై 71,239 ఓట్ల ముందుంజలో ఉన్నారు. అరుణాచల్‌ ఈస్ట్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి తాపిర్‌గావ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి లోవాంగ్‌చా వాంగ్లాట్‌ కంటే 33,092 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: