ఉత్తర తెలంగాణ జిల్లాలకు గుండెకాయగా భావించే కరీంనగర్‌లో ఇప్పుడు రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు ఎప్పుడూ క‌రీంన‌గ‌ర్ కేంద్ర‌బిందువుగా ఉంటూ వ‌స్తోంది. కేసీఆర్ టీఆర్ఎస్ ఆవిర్భావానికి, తాను తొలిసారి పోటీ చేసేందుకు క‌రీంన‌గ‌ర్‌నే ఎంపిక చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక గ‌త యేడాది చివ‌ర్లో జ‌రిగిని అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉత్త‌ర తెలంగాణ‌లోని ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో టీఆర్ఎస్ స్వీప్ చేసేసింది. 2014లో తెలంగాణ‌లో కేసీఆర్ తొలిసారి అధికారంలోకి వ‌చ్చేందుకు కూడా ఈ జిల్లాలే కార‌ణం.


అలాంటి ఉత్త‌ర తెలంగాణ‌లో ఇప్పుడు మార్పు మొద‌లైంది. నాలుగు నెల‌ల్లోనే అధికార టీఆర్ఎస్‌కు ప్ర‌జ‌లు షాక్ ఇచ్చారు. ఉత్త‌ర తెలంగాణ‌లోని ఆదిలాబాద్ - నిజామాబాద్ - క‌రీనంగ‌ర్ ఎంపీ సీట్ల‌ను బీజేపీ గెలుచుకుని అంద‌రికి షాక్ ఇచ్చింది. ఈ మూడు పార్లమెంట్‌ స్థానాల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం టీఆర్ఎస్‌కు షాక్‌గానే భావించవచ్చు. లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం సైతం కేసీఆర్ క‌రీంన‌గ‌ర్ నుంచే స్టార్ట్ చేశారు. అయినా ఆ సెంటిమెంట్‌ను ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు.


టీఆర్ఎస్ అగ్ర‌శ్రేణి నేత‌ల్లో ఒక‌రు అయిన వినోద్‌కుమార్‌పై బీజేపీ అభ్య‌ర్థి బండి సంజయ్‌ కుమార్ ఏకంగా  89,508 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సంజ‌య్ గ‌త ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి రెండో స్ధానంలో ఉన్నారు. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు ఏకంగా ఎంపీగా గెలిచి సంచ‌ల‌నం క్రియేట్ చేశారు. ఇక నిజామాబాద్ ప్ర‌జ‌లు కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత‌నే తిర‌స్క‌రించారు. ఇక్క‌డ బీజేపీ గెలిచేందుకు రెండు సంవ‌త్స‌రాలుగా ప్ర‌ణాళిక‌లు వేసింది. డీ శ్రీనివాస్ త‌న‌యుడు అర‌వింద్‌ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డంతో పాటు అక్క‌డ పుసుపు రైతుల‌కు కావాల్సిన హామీలు ఇవ్వ‌డంలో బీజేపీ నాయ‌క‌త్వం స‌క్సెస్ అయ్యింది. ఇక్క‌డ బీజేపీ ప్ర‌చారం కూడా చాలా వ్యూహాత్మ‌కంగా చేప‌ట్టింది.


ఇక ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్య‌ర్థి సోయం బాపూరావు గెలిచారు. టీఆర్ఎస్ బ‌లంగా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ గెల‌వ‌డం ఆ పార్టీ వ‌ర్గాల‌కే షాక్ ఇచ్చింది. ఇక పెద్ద‌ప‌ల్లిలో టీఆర్ఎస్ గెలిచినా... అక్క‌డ బీజేపీ చివ‌ర్లో అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డం వ‌ల్లే టీఆర్ఎస్ గెలిచిందంటున్నారు. వినోద్‌కుమార్‌, కవితను ఓడించడం ద్వారా ఉత్తర తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ నియంతృత్వాన్ని స‌హించ‌మ‌ని తీర్పు ఇచ్చారు. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియంతృత్వ వైఖ‌రితో పాటు ప్ర‌చారంలో కేసీఆర్‌ ‘‘హిందుగాళ్లు.. బొందుగాళ్లు’’..అని అనడం అవహేళన చేయడంగానే ప్రజలు భావించారు. హిందూత్వ వాదుల‌తో పాటు యువ‌త మెజార్టీ బీజేపీకే ఓట్లేసిన‌ట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: