చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళల్లో చాలామంది ఓడిపోయారు.  అంటే మంత్రివర్గంలో యాక్షన్ చేసిన వాళ్ళకన్నా ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళే ఎక్కువమంది లేండి. అలా ఓవర్ చేసిన వాళ్ళల్లో కూడా ఒకరు అదృష్టం కొద్ది ఓటమినుండి బయటపడ్డారు.

 

చంద్రబాబు మంత్రివర్గంలో 24 మంది మంత్రులు పోటి చేశారు. అందులో ఫిరాయింపులు ఐదుగురున్నారు. మిగిలిన వారంతా టిడిపి తరపున గెలిచి మంత్రులైన వాళ్ళే.  చంద్రబాబుతో కలుపుకుని పోటీ చేసిన 25 మందిలో 22 మంది ఓడిపోయారంటేనే అర్ధమవుతోంది వాళ్ళు ఏ స్ధాయిలో ఓవర్ యాక్షన్ చేశారో. గెలిచిన వాళ్ళల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుండి కింజరాపు అచ్చెన్నాయడున్నారు. విశాఖపట్నం జిల్లాలోని ఉత్తరం నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు, తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురంలో పోటీ చేసిన నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. గంటా గెలుపుపై కాస్త సందిగ్దం నెలకొన్నా గెలిచినట్లే అనుకోవాలి లేండి.

 

ఓడిపోయిన వాళ్ళల్లో అత్యధికులు జగన్మోహన్ రెడ్డి మాట వింటేనే ఒంటికాలిపై లేచే వాళ్ళు. సందర్భం లేకపోయినా, విషయం ఏదైనా కానీండి ప్రతీ విషయంలోను జగన్ ను లాగటం నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి వారిలో పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కాలువ శ్రీనివాసరావు, కళా వెంకటరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముందు వరసలో ఉన్నారు.

 

సరే వీళ్ళు తనను ఏమన్నా జగన్ అయితే పెద్దగా రియాక్ట్ అయ్యింది లేదు. అందుకనే జగన్ ను మంత్రులన్న మాటలన్నింటినీ జనాలు గుర్తు పెట్టుకున్నట్లున్నారు. అందుకే అందరికీ కొర్రు కాల్చి వాత పెట్టారు. నిజానికి అచ్చెన్నాయుడు కూడా చాలా ఓవర్ గా నే మాట్లాడారు. అసలు అచ్చెన్న చాలా రౌండ్ల వరకూ వెనకబడే ఉన్నారు. కానీ ఎందుచేతనో చివరి నిముషంలో పుంజుకుని గెలిచినట్లున్నారు.

 

మొత్తం మీద ఫలితాలను బట్టి చూస్తే అర్ధమవుతున్నదేమిటంటే ఓవర్ యాక్షన్ చేస్తే జనాలు అంగీకరించరని. అది టిడిపికే కాదు రేపు వైసిపి మంత్రులకు కూడా వర్తిస్తుంది. కాబట్టే జగన్ మంత్రివర్గంలో  కొలువై ఉండేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని జనాలు హెచ్చరించినట్లే ఉంది. మంత్రులను, ఎంఎల్ఏలను ఓడగొట్టటం ద్వారా చంద్రబాబుకు కూడా జనాలు గట్టి పాఠమే నేర్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: