40 ఏళ్ళ ఇండస్ట్రీ వల్ల ఉపయోగమేమిటంటే టిడిపి కంచుకోటలు బద్దలయ్యాయి. మిగిలిన పార్టీల గెలుపు ఒకటో నియోజకవర్గం నుండి లెక్కించాల్సుంటే టిడిపికి మాత్రం 47 నుండి మొదలవుతుంది. ఎందుకలా ? అంటే ఆ స్ధాయిలో టిడిపికి మద్దతుగా నిలిచే నియోజకవర్గాలు 47 ఉన్నాయి. పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకూ జరిగిన 8 ఎన్నికల్లో తక్కువలో తక్కువ ఆరు, ఏడు సార్లు వరుసగా గెలిచిన నియోజకవర్గాలు ఇవన్నీ. కానీ గురువారం ఫలితాల్లో  టిడిపి కంచుకోటలు సుమారు 29 దాకా బద్దలయ్యాయి.

 

36 ఏళ్ళ తెలుగుదేశంపార్టీ చరిత్రలో 23 స్ధానాలకే పరిమితమవ్వటం ఎప్పుడూ లేదు. నిజంగా చంద్రబాబునాయుడుకు  థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. కంచుకోటలను ఎన్టీయార్ తయారు చేస్తే చంద్రబాబు హయాంలో బద్దలైనాయనే చెప్పుకోవాలి. అంటే చంద్రబాబు పాలన అంతటి అథమస్ధాయిలో ఉందన్నది తేలిపోయింది.  

 

శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో  టిడిపి ఏడు సార్లు గెలిచింది. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, విజయనగరంలో కూడా ఏడు సార్లు గెలిచిన టిడిపి తాజాగా ఓడిపోయింది.  విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట, భీమిలీ, చోడవరం, మాడుగుల, అనకాపల్లిలో టిడిపి ఓడిపోవటం ఇదే తొలిసారి. పశ్చిమగోదావరి జిల్లాలోని రంపచోడవరం, తణుకు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, ఆచంట, గోపాలపురం, నర్సాపురం నియోజకవర్గాల్లో టిడిపి ఏడుసార్లు గెలిచింది. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది.

 

ఇక కృష్ణా జిల్లాలోని నందిగామ, అవనిగడ్డ, మైలవరం నియోజకవర్గాల్లో కూడా టిడిపి ఏడుసార్లు గెలిచింది. కానీ ఈ ఎన్నికల్లో ఓటిమిపాలైంది.  అలాగే గుంటూరు జిల్లాలోని పొన్నూరు, వినుకొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన బలమైన అభ్యర్ధె కూడా ఓడిపోయారు.

 

అనంతపురం జిల్లాలోని పెనుగొండ, ధర్మవరం, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో  టిడిపి ఓడింది చాలా తక్కువ. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, శ్రీకాళహస్తిలో కూడా దాదాపు టిడిపి ఓడిందే లేదు. కానీ తాజా ఎన్నికల్లో ఓడిపోయింది. కర్నూలు జిల్లాలోని పత్తికొండలో కెఇ శ్యాంబాబు ఓడిపోయారు. ఈ నియోజకవర్గం కూడా టిడిపి కంచుకోటనే చెప్పుకోవాలి. ఇలా చెప్పుకుంటుపోతే కంచుకోటలని చెప్పుకోదగ్గ నియోజకవర్గాల్లో సుమారు 29 చోట్ల ఓడిపోయింది. అంటే చంద్రబాబు పాలన ఎంత గొప్పగా ఉందో అర్ధమైపోతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: