పార్టీ పుట్టిన దగ్గర్నుంచి ఎదురవని ఘోర పరాజయం 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురైంది. తెలుగుదేశం కంచుకోటలుగా ఉన్న స్థానాల్లోనే ఓటమి పాలై కేవలం 23 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ పరాజయం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ జీవితంలోనే అతిపెద్ద ఎదురు దెబ్బ. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా టీడీపీ దిగజారిపోవడం చంద్రబాబుకు అసలు మింగుడుపడటం లేదు. ఇంతటి భారీ ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటున్న చంద్రబాబుకు ఇప్పుడు మరో కొత్త తలనొప్పి మొదలైంది. అదే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమోగిపోవడం. 


ఇంతటి ఘోర పరాజయం నుంచి టీడీపీ కోలుకోవడం సాధ్యం కాదని, ఇక మునిగిపోబోతున్న టీడీపీని ఒడ్డుకు చేర్చాలంటే జూనియర్ ఎన్టీఆరే దిక్కు అంటూ నెటిజన్లు, టీడీపీ వీరాభిమానులు నిన్నటి నుంచి హోరెత్తిస్తున్నారు. వయసు రీత్యా చంద్రబాబు ఇక రిటైర్‌మెంట్ తీసుకుని పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నాయకుడిగా ఎంత ప్రమోట్ చేసినప్పటికీ నారా లోకేష్ ఎప్పటికీ ప్రజా నాయకుడు కాలేరని , ఆయన టీడీపీని నడపలేరని , ఎన్టీఆర్ స్థాపించిన ఆ పార్టీకి ఇప్పుడు జూనియర్ ఒక్కడే దిక్కని అభిప్రాయపడుతున్నారు. 


ఈ సోషల్ మీడియా రచ్చని ఎలా ఆపాలో తెలియక చంద్రబాబు సతమతమవుతున్నారట. వ్యూహాత్మకంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను పక్కన పెట్టి పార్టీని తన ఆధీనంలోకి తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రాజకీయ వ్యూహాలను పన్నడంలో నిష్ణాతుడిగా పేరున్న చంద్రబాబు ఇప్పుడు పార్టీపై తన పట్టు జారకుండా ఎలా కాపాడుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: