రాష్ట్రంలో మిగిలిన అభ్యర్ధుల సంగతెలా ఉన్నా సొంత నియోజకవర్గం కుప్పంలో మాత్రం చంద్రబాబునాయుడుకు చుక్కలు కనబడ్డాయనే చెప్పాలి. పోలింగ్ ముగిసిన తర్వాత నుండి కుప్పంలో తనకు 70 వేల మెజారిటీ వస్తోందని ఓ వందసార్లన్నా చెప్పుంటారు చంద్రబాబు. ప్రతీ సమీక్షలోను ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలోను కుప్పం లాంటి ఓ నియోజకవర్గం ఒకటుండి తీరాలంటూ విచిత్రంగా చెప్పారు. రాష్ట్రంలోని 25 ఎంపిలకు 25 గెలవాలంటే కుప్పం లాంటి నియోజకవర్గం ఉండి తీరాలని చెప్పారు.

 

ప్రతీ ఎన్నికలోను చిత్తరు పార్లమెంటు నియోజకవర్గంలో టిడిపి గెలుస్తోందంటే అందుకు కుప్పంలో టిడిపికి వచ్చే మెజారిటీనే కారణమని చెప్పక తప్పదు. అందుకే గడచిన ఆరు ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంటులో టిడిపి తిరుగులేని విజయం సాధిస్తోంది. మిగిలిన ఆరు అసెంబ్లీల్లో ఎవరు గెలిచినా ఓడినా కుప్పంలో మాత్రం టిడిపికి భారీ మెజారిటీ వస్తుండేది. అందుకే చిత్తూరు లోక్ సభను టిడిపి సునాయాసంగా గెలుస్తుండేది.

 

సీన్ కట్ చేస్తే ఈ ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి చంద్రమౌళి ఏకంగా చంద్రబాబుకే చుక్కులు చూపించారు. ఒకదశలో చంద్రబాబు గెలుపే ప్రశ్నార్ధకమైందంటేనే పరిస్ధితి ఊహించుకోవచ్చు. నిజానికి చంద్రబాబు ముందు చంద్రమౌళి ఏ రకంగా చూసినా గట్టి అభ్యర్ధే కాదు. చంద్రమౌళి అభ్యర్ధిత్వాన్ని జగన్ రెండేళ్ళ క్రితమే ఖరారు చేశారు. అప్పటి నుండే చంద్రమౌళి నియోజకవర్గంలో బాగా పనిచేసుకున్నారు.

 

మొత్తానికి పోలింగ్ జరిగింది. కౌంటింగ్ మొదలైన తర్వాత చూస్తే పరిస్ధితి తారుమారు అవుతుందా అన్న అనుమానంలో పడిపోయారు టిడిపి నేతలు. ఎందుకంటే మొదటి రెండు రౌండ్లలో వైసిపికే మెజారిటీ వచ్చింది. ఎప్పుడైతే ఈ విషయం మీడియాలో కనబడిందో రాష్ట్రవ్యాప్తంగా టిడిపిలో టెన్షన్ పెరిగిపోయింది. మొత్తానికి మూడో రౌండు నుండి టిడిపి పుంజుకున్నది. 8వ రౌండులో కూడా చంద్రబాబు మెజారిటీ కేవలం 8 వేలే. దాంతో  ఈ మెజారిటీ ఎప్పుడైనా పడిపోతుందేమో అన్న టెన్షన్ పట్టుకుంది టిడిపి నేతలను.

 

కౌంటింగ్ ట్రెండ్స్ చూసిన వాళ్ళకు చంద్రబాబుకు 20 వేల మెజారిటి అయినా వస్తుందా అన్న అనుమానం మొదలైంది. సరే మొత్తానికి 15 రౌండ్ అయ్యేటప్పటికి 30 వేల మెజారిటీతో చంద్రబాబు గెలిచారు. కుప్పంలో చంద్రబాబుకే ఇంత కష్టమవటంతో దాని ప్రభావం ఎంపి ఓటింగ్ పై పడింది. దాంతో చిత్తూరు ఎంపి నియోజకవర్గాన్ని వైసిపి మొదటిసారిగా గెలుచుకున్నది. చంద్రబాబు మొదటి రెండు రౌండ్లలో వెనకబడటమేంటో టిడిపి నేతలకు అర్ధం కావటం లేదు. తర్వాత కూడా అంటే ఏడో రౌండు వరకూ చంద్రబాబుతో ఓట్ల విషయంలో చంద్రమౌళి బాగా పోటీ పడ్డారు. తాజా ఎన్నికల ఫలితం చూస్తే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పరిస్ధితేంటో అనే ఆందోళన మొదలైంది టిడిపి నేతల్లో.


మరింత సమాచారం తెలుసుకోండి: