ఏపీ రాజ‌కీయాల్లో సెంటిమెంట్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తెలుగు నేల అంటేనే సెంటిమెంట్ల‌కు కేరాఫ్‌.. ఇక్క‌డ ప్ర‌తి దానిని సెంటిమెంట్‌తో పోల్చి చూస్తుంటారు. రాజ‌కీయాలు, సినిమాలు ఇలా ఏ రంగంలో చూసుకున్నా ఈ సెంటిమెంట్ల‌పై ఎద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే తాజా ఎన్నిక‌ల్లో చాలా సెంటిమెంట్లు బ్రేక్ అయ్యాయి. గుంటూరు జిల్లా పొన్నూరులో వ‌రుస‌గా ఐదుసార్లు గెలిచిన ధూళిపాళ్ల న‌రేంద్ర ఆరో ప్ర‌య‌త్నంలో డ‌బుల్ హ్యాట్రిక్ మిస్ అయ్యారు. జిల్లాలో గ‌తంలో సీనియ‌ర్ నేత‌లుగా ఉన్న మాజీ మంత్రులు మాకినేని పెద‌ర‌త్త‌య్య‌, కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ జిల్లాలో వ‌రుస‌గా త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఐదుసార్లు గెలిచి ఆరో ప్ర‌య‌త్నంలో ఓడి డ‌బుల్ హ్యాట్రిక్ మిస్ చేసుకున్నారు.


న‌రేంద్ర తాజా ఎన్నిక‌ల్లో పొన్నూరులో ఆరో ప్ర‌య‌త్నంలో వైసీపీ అభ్య‌ర్థి కిలారు రోశ‌య్య చేతుల్లో ఓడిపోయారు. దీంతో ఆ సెంటిమెంట్‌కు న‌రేంద్ర బ‌లైన‌ట్లు అయ్యింది. ఇక విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నం నుంచి పోటీ చేసిన మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు కూడా మ‌రో సెంటిమెంట్‌కు బ‌ల‌య్యారు. అయ్య‌న్నపై ఈ ఎన్నిక‌ల్లో టాలీవుడ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ సోద‌రుడు పెట్ల ఉమాశంక‌ర్ గ‌ణేష్ విజ‌యం సాధించారు. గ్రామ‌స్థాయి నుంచి కార్య‌క‌ర్త‌గా..అందులోనూ అయ్య‌న్న శిష్యుడిగా ఎదిగిన గ‌ణేష్ చివ‌ర‌కు ఆయ‌న‌పైనే సంచ‌ల‌న విజ‌యం సాధించారు.


ఇక అయ్య‌న్న సెంటిమెంట్ విష‌యానికి వ‌స్తే ప్ర‌తి ప‌దేళ్ల‌కు ఆయ‌న ఎన్నిక‌ల్లో ఓడిపోతుంటారు. తాజా ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఓడిపోయారు. 1983, 1985 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన అయ్య‌న్న 1989లో ఓడిపోయారు. ఆ త‌ర్వాత 1994లో గెలిచి..తిరిగి 1998 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో (9 సంవ‌త్స‌రాల‌కు) ఓడారు. ఆ త‌ర్వాత 2004లో రాష్ట్రంలో టీడీపీ ఓడినా న‌ర్సీప‌ట్నంలో మాత్రం అయ్య‌న్న గెలిచారు. 2009లో త‌న శిష్యురాలు అయిన బోలెం ముత్యాలపాప చేతిలో ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు. ఇక మ‌ళ్లీ ప‌దేళ్ల‌కు ఇప్పుడు త‌న మ‌రోశిష్యుడు ఉమాశంక‌ర్ గ‌ణేష్ చేతుల్లో ఓడిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: